KCR: కేసీఆర్ కీలక నిర్ణయం... ఢిల్లీని వదిలి వచ్చేసిన ఎంపీలు!
- చివరి రెండు రోజులూ సభలో ఉండాల్సిన అవసరం లేదు
- డ్రామాలు చూడటం కన్నా ప్రజల్లో ఉండటం మేలు
- కేసీఆర్ ఆదేశాలతో హస్తిన వీడిన ఎంపీలు
లోక్ సభ సమావేశాల చివరి రెండు రోజులూ సభలో ఉండాల్సిన అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో, ఢిల్లీలోని ఎంపీలంతా హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అయ్యారు. సభలో జరిగే డ్రామాలను చూడటం కన్నా, ప్రజలతో ఉందామన్న ముఖ్యమంత్రి సూచన మేరకు సభకు హాజరు కాకూడదని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. మరోపక్క, పార్లమెంట్ సమావేశాలు రేపటితో ముగియనున్న సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ, తెలుగుదేశం, వైసీపీలు నిత్యమూ అవిశ్వాస తీర్మానాలను ప్రతిపాదిస్తుండటం, ఇదే సమయంలో కావేరీ నదీ జలాల బోర్డును ఏర్పాటు చేయాలని కోరుతూ, అన్నాడీఎంకే సభ్యుల నినాదాలతో స్పీకర్ సభను నిత్యమూ వాయిదా వేస్తూ వెళుతున్న సంగతి తెలిసిందే. నిత్యమూ జరుగుతున్న లోక్ సభ నాటకాన్ని చూడటం కన్నా, సభకు వెళ్లకుండా ప్రజల్లో ఉండి, వారి సమస్యలను తీర్చేందుకు మరో రెండు రోజుల అదనపు సమయం కేటాయించడం మంచిదని కేసీఆర్ అభిప్రాయపడ్డట్టు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.