Vijayawada: గుంటూరు, విజయవాడల మధ్య ఎక్స్ ప్రెస్ రైలు... ప్రజాదరణపై అనుమానమే!
- తెల్లవారుజామున 4.25 గంటలకు విజయవాడలో రైలు
- 6.25కు గుంటూరు చేరుకునే ఎక్స్ ప్రెస్
- రెండు గంటల ప్రయాణ సమయంపై ప్రయాణికుల నిరాశ
గుంటూరు - విజయవాడ నగరాల మధ్య నిత్యమూ ఎక్స్ ప్రెస్ రైలును నడపాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకోగా, దీనికి ప్రజాదరణ ఏ మేరకు ఉంటుందన్న విషయంమై అనుమానాలు నెలకొన్నాయి. నంబర్ 07237తో తెల్లవారుజామున 4.2గంటలకు విజయవాడలో బయలుదేరి 5.10కి మంగళగిరి, ఆపై 6.25కు గుంటూరు చేరేలా రైలును నడుపుతామని, తిరుగు ప్రయాణంలో 07238 నంబరుతో రాత్రి 10.15 గంటలకు గుంటూరు నుంచి రైలు బయలుదేరుతుందని, 11.15కు విజయవాడ చేరుతుందని అధికారులు వెల్లడించారు.
ఈ రైలులో నాలుగు స్లీపర్, 12 సెకండ్ క్లాస్, రెండు ఎస్ఎల్ఆర్ బోగీలుంటాయని సీనియర్ డీసీఎం ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. వాస్తవానికి విజయవాడ నుంచి గుంటూరు మధ్య ప్రయాణ సమయం నాన్ స్టాప్ బస్సులో 40 నుంచి 45 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అన్ని చోట్లా ఆగుతూ వెళ్లినా, 1.15 గంటల కన్నా అధిక సమయం పట్టదు. అటువంటి పరిస్థితుల్లో రెండు గంటల ప్రయాణ సమయం తీసుకునే రైలును ఎవరు ఎక్కుతారన్న ప్రశ్న ఉదయిస్తోంది. ఇక రైలు విజయవాడ నుంచి బయలుదేరే సమయం కూడా సరిగ్గా లేదని, 35 కిలోమీటర్ల దూరానికి రెండు గంటల సమయం ఏంటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. కాగా, విజయవాడ నుంచి వచ్చేటప్పుడు రెండు గంటలుగా ఉన్న ప్రయాణ సమయం, వెళ్లేటప్పుడు మాత్రం గంటకే పరిమితం కావడం గమనార్హం.