Uttar Pradesh: కడుపు నొప్పి తగ్గిస్తానంటూ యువతిని రేప్ చేసిన తాంత్రికుడు... 25 ఏళ్ల జైలు శిక్ష!
- మధుర బృందావనంలో ఘటన
- గత సంవత్సరం జూలైలో ఘటన
- కేసును వేగంగా విచారించిన కోర్టు
- ఏడాదిలోనే తీర్పు వెల్లడి
మధురలోని బృందావనంలో ఓ యువతి కడుపునొప్పిని తగ్గిస్తానని చెప్పి, అత్యాచారం చేసిన ఓ తాంత్రికుడికి 25 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధిస్తూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పిచ్చింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, హత్రాస్ కు చెందిన ఓ మహిళ గత సంవత్సరం జూలైలో బాబా ద్వారకాదాస్ ను ఆశ్రయించి, తనకు కొంతకాలంగా కడుపునొప్పిగా ఉన్నట్టు తెలిపింది.
తన భర్త, నాలుగేళ్ల కుమార్తెతో సహా ఆమె ద్వారకాదాస్ దగ్గరికి వెళ్లగా, ఆమె నొప్పిని తగ్గిస్తానని చెప్పిన ఆయన, రాత్రి 10 గంటల తరువాత ప్రత్యేక పూజలు చేయాల్సి వుంటుందని నమ్మబలికాడు. ఆపై ఆమె భర్తకు ఓ దీపం ఇచ్చి, దీపం ఆరిపోయిన తరువాతే లోపలికి రావాలని ఆదేశించాడు. తర్వాత బాధితురాలిని వేధించి, అత్యాచారం చేయడంతో పాటు చెడు కలిగించే భూతాలను తరిమివేసినట్టు చెప్పాడు.
తాను తలపెట్టిన 'నిబు పూజ'లో ఇది కూడా భాగమేనని, అంగీకరించకుంటే కుటుంబమంతా చనిపోతారని బెదిరించి లొంగదీసుకున్నాడు. జరిగిన ఘటనను ఆమె భర్తకు చెప్పగా, ఆ జంట పోలీసులను ఆశ్రయించడంతో ద్వారకాదాస్ బండారం బట్టబయలైంది. కేసును విచారించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి వివేకానంద శరణ్ త్రిపాఠి, బాధితురాలు అత్యాచారానికి గురైన మాట వాస్తవమేనని తేల్చారు. దోషికి 25 ఏళ్ల జైలుశిక్షతో పాటు రూ. 25 వేలు జరిమానా విధిస్తున్నానని, దాన్ని చెల్లించని పక్షంలో మరో 27 నెలలు జైలు శిక్షను అనుభవించాలని తీర్పిచ్చారు.