Tamilnadu: ఏపీ బస్సులపై ప్రతాపం చూపుతున్న తమిళ తంబీలు!
- తమిళనాట కొనసాగుతున్న బంద్
- శివారు ప్రాంతాల్లో ఏపీ బస్సుల ధ్వంసం
- స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసిన వ్యాపారులు
కావేరీ నదీ జలాల బోర్డును తక్షణం ఏర్పాటు చేయాలంటూ తమిళనాట జరుగుతున్న బంద్ హింసాత్మకంగా మారింది. సరిహద్దు జిల్లాల్లో తిరుగుతున్న పలు ఆంధ్రప్రదేశ్ బస్సులపై తంబీలు తమ ప్రతాపాన్ని చూపించారు. చెన్నై శివార్లు, వేలూరు, తిరుత్తణి ప్రాంతాల్లో ఏపీ బస్సులను నిరసనకారులు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న చిత్తూరు, తిరుపతి డిపోల అధికారులు, తమిళనాడుకు బస్సు సర్వీసులను నిలిపివేశారు.
విపక్షాలు పిలుపునిచ్చిన ఈ బంద్ కు అధికార అన్నాడీఎంకే కూడా సహకరిస్తుండటంతో బంద్ సంపూర్ణంగా సాగుతోంది. రోడ్డు రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోగా, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దుకాణాలను వ్యాపారులు స్వచ్ఛందంగానే మూసివేశారు. విద్యాసంస్థలకు మినహాయింపు ఇచ్చినప్పటికీ, పలు చోట్ల స్కూళ్లు తెరచుకోలేదు. కాగా, పలు ప్రాంతాల్లో డీఎంకే నేతలు, కార్యకర్తలు రోడ్లపై బైఠాయించి నిరసనలు తెలిపారు.