Telugudesam: పార్లమెంట్ వాయిదా పడ్డా సభను దాటి బయటకు రావద్దు: ఎంపీలకు చంద్రబాబు కీలక ఆదేశాలు
- హోదా కోసం వినూత్న నిరసన
- ఇప్పటికే ఆమరణ దీక్షకు నిర్ణయించిన వైసీపీ
- పోటీ నిరసనలకు టీడీపీ సిద్ధం
నేడు అవిశ్వాసంపై చర్చించకుండా లోక్ సభ వాయిదా పడితే, తెలుగుదేశం పార్టీ ఎంపీలు సభలోనే ఉండి నిరసనలు తెలియజేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన ఎంపీలకు కీలక ఆదేశాలు జారీచేశారు. హోదాపై నిరసనకు వినూత్న రీతిలో మార్గాలను అన్వేషించాలని, అందుకోసం సభలోనే ఉండిపోవాలని ఆయన సూచించారు.
కాగా, ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ నిరవధిక వాయిదా పడగానే రాజీనామాలు, ఆపై ఏపీ భవన్ వేదికగా ఆమరణ దీక్షకు పిలుపునిచ్చిన నేపథ్యంలో, పోటీ కార్యక్రమాలను టీడీపీ సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. నేడు లేదా రేపు సభ వాయిదా పడగానే అనూహ్య రీతిలో నిరసనలను తెలియజేయాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగానే ఎంపీలు లోక్ సభను విడిచి రావద్దని ఆదేశాలు జారీ చేసినట్టు టీడీపీ వర్గాలు వెల్లడించాయి.