japan: ఆమె వంతు రాకుండానే గర్భవతి అయింది.. ఉద్యోగం కోల్పోయింది!
- జపాన్ సంస్థల్లో మహిళలపై దారుణ నిబంధనలు
- ఎప్పుడు గర్భవతి కావాలి, ఎప్పుడు పిల్లలను కనాలి అనేది కూడా వారి చేతిలో లేదు
- ప్రతి ఐదుగురిలో ఒకరు ఉద్యోగాన్ని కోల్పోతున్నారు
గర్భవతి అయిందన్న కారణంతో ఓ మహిళా ఉద్యోగిని విధుల నుంచి తొలగించిన ఘటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆమె వంతు రాకుండా గర్భవతి కావడమే ఆమె చేసిన నేరం. ఈ ఘటన జపాన్ లో చేటు చేసుకుంది. తన వంతు రాకుండానే, స్వార్థంతో గర్భవతి అయిన మహిళను ఆమె బాస్ మందలించడమే కాకుండా, విధుల నుంచి తొలగించాడు.
టెలిగ్రాఫ్ పత్రిక కథనం ప్రకారం, ఉత్తర జపాన్ లో ఉన్న ఓ ప్రైవేట్ చైల్డ్ కేర్ సెంటర్ లో ఓ మహిళ పని చేస్తోంది. సంస్థలో పని చేస్తున్న మహిళలు ఎవరెవరు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు పిల్లలను కనాలి అనే లిస్ట్ ముందుగానే సిద్ధం చేశారు. అయితే, తన షిఫ్ట్ రాకుండా సదరు మహిళ గర్భవతి కావడంతో నిబంధనలను ఉల్లంఘించినట్టైంది. దీంతో, ఆమెను విధుల నుంచి తొలగించారు.
ఈ ఘటనతో మహిళల పట్ల కొన్ని జపాన్ సంస్థలు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నాయనే విషయం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. 2015లో ప్రభుత్వం చేపట్టిన ఓ సర్వే ప్రకారం... గర్భవతి అయిన తర్వాత, తాము పని చేస్తున్న ప్రాంతంలో మహిళలు రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గర్భం దాల్చిన ప్రతి ఐదుగురిలో ఒకరు తమ ఉద్యోగాన్ని కోల్పోతున్నారు.