hang: 1882లో ఉరిశిక్ష విధించిన వ్యక్తికి తాజాగా క్షమాభిక్ష ప్రసాదించిన వైనం!
- లండన్లో 136 ఏళ్ల క్రితం ఘటన
- మైలెస్ జాయిసీ అనే నిర్దోషికి శిక్ష
- అనంతరం విచారణకు కమిషన్ నియామకం
- ఆ శిక్ష సరైంది కాదని తాజాగా తేల్చిన కమిషన్
లండన్లో 136 ఏళ్ల క్రితం ఓ వ్యక్తిని దోషిగా పేర్కొంటూ మరణ శిక్ష విధించారు. తాజాగా, ఆ వ్యక్తి ఆ నేరం చేయలేదని తేలడంతో, ఆ వ్యక్తికి క్షమాభిక్ష ప్రసాదిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు క్షమాభిక్ష ప్రకటిస్తే ఆ వ్యక్తికి ఒరిగేది ఏమీ ఉండదని తెలిసి కూడా ప్రకటన చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే, 1882లో ఐదుగురు కుటుంబ సభ్యులను కొందరు హత్య చేశారు. ఆ ఘటనలో దర్యాప్తు చేపట్టి, ముగ్గురు వ్యక్తులకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. అందులో మైలెస్ జాయిసీ అనే వ్యక్తి నిర్దోషి అని కొందరు చెప్పారు. అయినప్పటికీ ఎవ్వరూ పట్టించుకోలేదు. వారిని ఉరి తీసేశారు.
అంతా జరిగాక మైలెస్ జాయిసీ దోషా? కాదా? అని తేల్చడానికి ఐరిష్ ప్రభుత్వం ఒక కమిషన్ విధించి దర్యాప్తు జరిపింది. అతడికి వేసిన శిక్ష సరైంది కాదని కమిషన్ తేల్చి చెప్పడంతో దీనిపై ఐర్లాండ్ అధ్యక్షుడు తాజాగా మరణానంతర క్షమాభిక్ష ప్రసాదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది ఐర్లాండ్, బ్రిటన్ చరిత్రకు మచ్చ తెచ్చిన ఘటన అని, ఆ వ్యక్తికి క్షమాభిక్ష ప్రసాదించడం వల్ల అయినా దాన్ని కొంతమేర సరిదిద్దుకోగలమని వ్యాఖ్యానించారు. సదరు బాధితుడికి ఇంగ్లిష్ రాకపోవడంతో అతడి వాదనను సరిగ్గా వినిపించలేకపోయాడని చెప్పారు.