West Bengal: పెన్షన్ డబ్బుల కోసం తల్లి శవాన్ని మూడేళ్లుగా ఫ్రిజ్ లో దాచిన తనయుడు!
- 7 ఏప్రిల్ 2015న మృతి చెందిన బినా మజుందార్
- ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పని చేసి రిటైర్ అయిన బినా మజుందార్
- ప్రతినెలా 50 వేల పెన్షన్
తల్లి పెన్షన్ డబ్బుల కోసం మూడేళ్లుగా ఆమె మృతదేహాన్ని ఫ్రిజ్ లో ఉంచాడో సుపుత్రుడు. దాని వివరాల్లోకి వెళ్తే.. కోల్ కతాలోని దక్షిణ బెహాలాకు చెందిన తోళ్ల నిపుణుడు సుభబ్రత మజుందార్.. తల్లి బినా మజుందార్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేసి రిటైరయ్యారు. దీంతో ఆమెకు 50 వేల రూపాయల పెన్షన్ వచ్చేది. ఆమె 7 ఏప్రిల్ 2015న మృతి చెందారు. దీంతో ఆమె పెన్షన్ ఆగిపోతుందని భావించిన సుభబ్రత తల్లి మరణ వార్తను ఎవరికీ తెలియనివ్వలేదు.
తనకున్న అనుభవంతో తోళ్ల పరిశ్రమలో వాడే పలు రసాయనాలను ఉపయోగించి, ఆమె శవాన్ని ఒక పెద్ద ఫ్రిజ్ లో భద్రపరిచాడు. దుర్వాసన రాకుండా ఉండేందుకు ఆ ఫ్రిజ్ ను నిరంతరాయంగా పని చేసేలా ఉంచాడు. ఒక అంతస్తులో ఆ ఫ్రిజ్ ను ఉంచి మరో అంతస్తులో తానుండేవాడు. ఆమె డెబిట్ కార్డు ఉపయోగించి, మూడేళ్లుగా ఆమె పింఛన్ ను తీసుకుంటున్నాడు. అయితే నిరంతరాయంగా పని చేసే ఫ్రిజ్ నుంచి రసాయనాల వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది.
సుభబ్రతను అదుపులోకి తీసుకుని విచారించగా, తల్లి శరీరంలో అవయవాలు తొలగించి, ఆమె మృతదేహాన్ని భద్రపరిచినట్టు గుర్తించారు. అతని తండ్రి గోపాల్ మజుందార్ కూడా అదే భవంతిలో ఉంటున్నారని, ఆయనను కూడా ప్రశ్నించాల్సి ఉందని వారు తెలిపారు. పెన్షనర్ ఎవరైనా ప్రతి ఏటా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుందని, మరి, మూడేళ్లుగా సుభబ్రత ఎలా పెన్షన్ తీసుకోగలిగాడన్న దానిపై దర్యాప్తు సాగుతోందని వారు వెల్లడించారు.