China: చైనాలో ప్రాణాలు తీస్తున్న పని ఒత్తిడి.. గతేడాది 246 మంది పోలీసుల మృతి
- పని ఒత్తిడితో సతమతం అవుతున్న పోలీసులు
- ప్రతి ముగ్గురిలో ఇద్దరు మృతి
- ఒత్తిడి తగ్గించేందుకు సాంకేతికతను ఉపయోగించుకునే యోచనలో ప్రభుత్వం
పని ఒత్తిడి చైనాలో పోలీసులను పొట్టనపెట్టుకుంటోంది. ప్రతి ముగ్గురిలో ఇద్దరు అధిక పని కారణంగా ప్రాణాలు విడుస్తున్నారు. ఈ వివరాలను స్వయంగా ఆ దేశ ప్రజా భద్రతా వ్యవహారాల శాఖ వెల్లడించింది. గతేడాది మొత్తం 361 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోగా, వీరిలో 246 మంది పని ఒత్తిడి కారణంగా మృతి చెందినట్టు వివరించింది.
రోజుకు 13 నుంచి 15 గంటల వరకు పనిచేస్తుండడమే ఇందుకు కారణమని తెలిపింది. పోలీసు కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, వారి పెన్షన్లను, బీమా ప్యాకేజీలను పెంచే ఆలోచనలో ఉన్నట్టు తెలిపింది. పోలీసులపై ఉన్న పని ఒత్తిడిని తగ్గించేందుకు సాంకేతికతను ఉపయోగించుకునే ఆలోచనలో ఉన్నట్టు మంత్రిత్వశాఖ తెలిపింది.