Bank of India: మరో బ్యాంకింగ్ కుంభకోణం... 11 బ్యాంకులను రూ. 2,654 కోట్లకు ముంచిన 'డైమండ్ పవర్ ఇన్ఫ్రా'!

  • వడోదర కేంద్రంగా పనిచేస్తున్న డీపీఐఎల్
  • అక్రమ పద్ధతుల్లో బ్యాంకుల నుంచి రుణాలు
  • ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ

ఇండియాలో మరో పెద్ద బ్యాంకింగ్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. వడోదర కేంద్రంగా పనిచేస్తున్న డైమండ్ పవర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (డీపీఐఎల్), 11 బ్యాంకుల కన్సార్టియం నుంచి రూ. 2,654 కోట్ల రుణాన్ని తీసుకుని, తిరిగి చెల్లించకుండా మోసం చేసిందని, ఈ విషయమై కేసును నమోదు చేశామని సీబీఐ వెల్లడించింది. ఈ కంపెనీ పేరును రుణాల ఎగవేతదారుల జాబితాలోనూ, ఎగుమతి రుణ హామీ కార్పొరేషన్ హెచ్చరికల జాబితాలోనూ చేర్చినప్పటికీ, తప్పుడు పద్ధతుల్లో సంస్థ యాజమాన్యం రుణాలను పొందిందని సీబీఐ పేర్కొంది.

ఇప్పటికే కంపెనీ ప్రమోటర్ ఎస్ఎస్ భట్నాగర్, ఆయన కుమారులు అమిత్, సుమిత్ లపైనా కేసు పెట్టామని తెలిపింది. డీపీఐఎల్ సంస్థ యాజమాన్యం వివిధ అక్రమ పద్ధతుల్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ. 670.51 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ. 349 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ. 279.46 కోట్ల రుణాన్ని తీసుకున్నారని ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.

కాగా, కేసు నమోదైన మరుక్షణం సీబీఐ అధికారులు వడోదరలోని కంపెనీ ఆఫీసులు, డైరెక్టర్ల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కుంభకోణానికి కేంద్రంగా ఉందని, నగదు క్రెడిట్ పరిమితులను ఈ బ్యాంకే జారీ చేసిందని వెల్లడించింది. 2016 జూన్ నాటికి రుణమొత్తం గరిష్ఠానికి చేరగా, ఆపై నెలల వ్యవధిలోనే మొత్తం రుణాన్ని నిరర్థక ఆస్తి కింద బ్యాంకులు ప్రకటించడం గమనార్హం.

  • Loading...

More Telugu News