Nalgonda District: నల్గొండలో ఘోరం... ట్రాక్టర్ కాలువలో పడి 9 మంది దుర్మరణం... గల్లంతైన పది మంది!
- ఏఎంఆర్ కాలువలో పడిపోయిన ట్రాక్టర్
- ట్రాక్టర్ లో 30 మంది కూలీలు
- మృతులంతా మిరప చేలో పనిచేసేందుకు వెళుతున్న కూలీలే
- మృతుల సంఖ్య పెరిగే అవకాశం
నల్గొండ జిల్లాలో ఈ ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 30 మంది వ్యవసాయ కూలీలతో వెళుతున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తూ ఏఎంఆర్ కాలువలో పడిపోగా, ట్రాక్టర్ లోని అందరూ మునిగిపోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు వారిని రక్షించే కార్యక్రమాలను చేపట్టేలోపే, 9 మంది మృతిచెందారు. మరి కొంతమంది ఈదుకుంటూ ఒడ్డుకు రాగా, మరో 10 మంది వరకూ గల్లంతయ్యారు.
కూలీలంతా వద్దిపట్లలోని పడమటి తండా నుంచి పులిచర్ల సరిహద్దుల్లోని మిరపచేనులో కూలీ పనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి వచ్చి గల్లంతైన వారికోసం స్థానికుల సాయంతో గాలింపు చర్యలు ప్రారంభించారు. గాయపడిన ఐదుగురిని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించినట్టు పోలీసులు తెలిపారు. నీటిలో ట్రాక్టర్ కింద మరికొన్ని మృతదేహాలు ఉండి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.