China: చైనాపై రూ. 6,50,000 కోట్ల అదనపు పన్ను... బెదిరించిన ట్రంప్!
- చైనా నుంచి దిగుమతి వస్తువులపై మరింత పన్ను
- వాణిజ్య లోటు దిగిరాలేదని భావిస్తున్న ట్రంప్
- వెనక్కు తగ్గని చైనా - అమెరికా వస్తువులపై పన్నులు
ఇప్పటికే చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై పన్నులను పెంచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మరో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికీ చైనా, అమెరికా మధ్య వాణిజ్య లోటు అధికంగానే ఉందని, ఇది అమెరికా అభివృద్ధికి విఘాతమేనన్న నిర్ణయానికి వచ్చిన ఆయన, అదనంగా మరో 100 బిలియన్ డాలర్ల విలువైన పన్నులను (సుమారు రూ. 6.5 లక్షల కోట్లు) వసూలు చేసేలా కొత్త పన్నులను విధించనున్నారు.
సంవత్సరానికి సుమారు 505 బిలియన్ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులు అమెరికాకు వస్తుండగా, వీటిపై 100 బిలియన్ డాలర్లు... అంటే సుమారు 20 శాతం మేరకు పన్నులను పెంచాలని ఆయన నిర్ణయించుకున్నారు. చైనా వస్తువులతో అమెరికా రైతులకు, ఉత్పత్తిదారులకు నష్టం కలుగుతున్నందునే తాజా పన్నులను ప్రతిపాదిస్తున్నట్టు గురువారం సాయంత్రం డొనాల్డ్ ట్రంప్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఇప్పటికే రెండు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్యపోరు, ప్రపంచ మార్కెట్ వర్గాలను వణికిస్తున్న నేపథ్యంలో, ఈ కొత్త ట్రంప్ ఎత్తుగడపై చైనా స్పందించాల్సి వుంది. కాగా, తాము కూడా ఏ మాత్రం వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేస్తున్న చైనా, అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలను ఇబ్బడిముబ్బడిగా పెంచింది. ఇటీవలే సోయాబీన్స్, చిన్న విమానాలు తదితరాలపై అదనంగా 50 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 30 వేల కోట్లు) అదనపు పన్నులను విధిస్తున్నట్టు చైనా ప్రకటించిన సంగతి తెలిసిందే.