ipl: రేపే ఐపీఎల్ ప్రారంభం... ముంబై ఇండియన్స్ దూకుడు చూపుతుందా?
- తొలి రెండు సీజన్లలో లీగ్ దశలోనే నిష్క్రమించిన ముంబై ఇండియన్స్
- తరువాతి మూడు సీజన్లలో ఫర్వాలేదనిపించి, ప్లే ఆఫ్ కు అర్హత
- తరువాతి ఐదు సీజన్లలో మూడుసార్లు ఛాంపియన్
రేపు ఐపీఎల్ సీజన్-11 ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో సీజన్ 10 ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను ఢీ కొట్టనుంది. మహేంద్రసింగ్ ధోనీ సారధ్యంలో మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా రెండేళ్ల నిషేధం ఎదుర్కొన్న చెన్నై మళ్లీ ధోనీ సారధ్యంలో పునరాగమనం చేసింది.
ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టు, ఆట వివరాల్లోకి వెళ్తే... రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ గణనీయమైన విజయాలు సాధించింది. రోహిత్ దూకుడైన ఆటతీరుకు కృనాల్ పాండ్యా నిలకడ తోడవుతూ జట్టుకు మంచి విజయాలు సొంతం చేసుకుంది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మెరుపులు, సౌరభ్ తివారీ, సూర్యకుమార్ యాదవ్ ల దూకుడు జట్టును పలు సందర్భాల్లో ఆదుకున్నాయి.
సిద్దేశ్ లాడ్, శరద్ లాంబా, తజిందర్ దిల్లాన్, మయాంక్ మార్కండే, అనుకూల్ రాయ్ నిరూపించుకోవాల్సి ఉండగా, అండర్ 19 వరల్డ్ కప్ లో ఇషాన్ కిషన్ నిరూపించుకున్నాడు. ఆదిత్య తారే గత ఐపీఎల్ లో ఆకట్టుకున్నాడు. టీమిండియా తురుపు ముక్క జస్ ప్రీత్ బుమ్రా యార్కర్లతో చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నాడు. రాహుల్ చహర్, మొహిసిన్ ఖాన్, నిధీశ్, ప్రదీప్ సాంగ్వాన్ ల ప్రతిభను ప్రదర్శించేందుకు ఇదో చక్కని అవకాశం.
ఇక విదేశీ ఆటగాళ్ల విషయానికి వస్తే.. జేపీ డుమిని, పొలార్డ్, కమిన్స్, లూయీస్, కట్టింగ్, ధనంజయ, బెహ్రన్ డార్ఫ్, ముస్తాఫిజుర్, మెక్లీన్ గన్ లు ఆయా దేశాల జట్లకు ఆడుతూ ఇప్పటికే నిరూపించుకున్నారు. తొలి రెండు సీజన్లలో లీగ్ దశలోనే నిష్క్రమించిన ముంబై ఇండియన్స్ జట్టు ఆ తరువాతి మూడేళ్లు ఆకట్టుకునే ఆటతీరును ప్రదర్శించింది. దీంతో ఒకసారి రన్నరప్, రెండుసార్లు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది.
ఇక ఆ తరువాతి ఐదేళ్లలో అద్భుతంగా పుంజుకుని, తిరుగులేని ఆటతీరుతో మూడుసార్లు ఐపీఎల్ చాంపియన్ గా నిలిచింది. 2013 సీజన్ మధ్యలో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ, ఐపీఎల్ లో తిరుగులేని సారధిగా జట్టును ముందుకు నడిపించాడు. ఈ సారి వేలంలో ఆల్ రౌండర్లు, బౌలర్లను కొనుగోలు చేయించిన రోహిత్, బ్యాటింగ్ భారం మోసేందుకు సిధ్దమయ్యాడు. రేపటి మ్యాచ్ లో ధోనీ సేనపై పైచేయి సాధిస్తే రోహిత్ సేనకు తిరుగులేని ఆత్మస్థైర్యం లభిస్తుంది.