Telugudesam: జగన్ ను ఎదుర్కోలేకే.. బీజేపీని టీడీపీ టార్గెట్ చేసింది: విష్ణుకుమార్ రాజు
- అసెంబ్లీని టీడీపీ ఏక పక్షంగా నిర్వహిస్తోంది
- ప్రజాసమస్యలను ప్రస్తావిస్తే, మైక్ కట్ చేస్తున్నారు
- ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది
తెలుగుదేశం పార్టీపై బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్ ను ఎదుర్కోలేకే టీడీపీ నేతలు బీజేపీని టార్గెట్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలను టీడీపీ ప్రభుత్వం ఏక పక్షంగా నిర్వహిస్తోందని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలను సభలో ప్రస్తావిస్తే, మైక్ కట్ చేస్తున్నారని ఆరోపించారు. తాము అరచి గోల చేస్తే, ఒక రోజు మాట్లాడే అవకాశం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగానే అసెంబ్లీ సమావేశాలను జగన్ బహిష్కరించినట్టు అర్థమవుతోందని చెప్పారు. విశాఖలో చోటు చేసుకున్న భూకుంభకోణాలకు టీడీపీ మంత్రి కారణం కాదా? అని ప్రశ్నించారు. ఈ కుంభకోణంలో సిట్ విచారణను ఎందుకు ఆపేశారని ఆయన నిలదీశారు.
రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని... తమపై తప్పుడు ఆరోపణలు చేస్తే, చూస్తూ ఊరుకోబోమని విష్ణు హెచ్చరించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సహా ఎవరికైనా ఈ ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉందని అన్నారు. ఆనాడు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు... ఇప్పుడు మాట మార్చి, బీజేపీని విమర్శించడం సరికాదని అన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు స్పందించారు.