IMD: రెండు రోజుల పాటు ఏపీలో పిడుగులు, పెనుగాలులు... హెచ్చరించిన వాతావరణ శాఖ!
- జార్ఖండ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం
- మహారాష్ట్రలో అల్పపీడన ద్రోణి
- కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షాలు
- ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు
సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తున ఉత్తర జార్ఖండ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడినందున, దీని ప్రభావంతో నేడు, రేపు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు తూర్పు గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడతాయని, పెను గాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది.
దక్షిణ మహారాష్ట్ర నుంచి మరాట్వాడా మీదుగా విదర్భ వరకూ కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి కారణంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోనూ తేలికపాటి జల్లులు కురుస్తాయని, ఆకాశం మేఘావృతమై, సగటు ఉష్ణోగ్రతలు తగ్గుతాయని తెలిపింది.