Congress: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం.. ప్రత్యేక హోదా ఇవ్వడం తథ్యం: తులసిరెడ్డి
- టీడీపీ, వైసీపీలు చిత్తశుద్ధితో పనిచేయట్లేదు
- వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాకులాడుతున్నాయి
- కేంద్ర ప్రభుత్వ చివరి బడ్జెట్లో కూడా రాష్ట్రానికి అన్యాయం
- ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది
ఏపీలో అధికార టీడీపీ, ప్రధాన పతిపక్షం వైసీపీల తీరు చూస్తోంటే 'ఆత్మ శుద్ధిలేని ఆచారమది యేల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధిలేని శివపూజలేల, విశ్వదాభి రామ, వినురవేమా' పద్యం జ్ఞాపకం వస్తుందని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి చురకలంటించారు. ఈ రోజు విజయవాడలోని తమ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... ఈ రెండు పార్టీలు పోరాటంలో ఏ మాత్రం చిత్తశుద్ధి కనబర్చట్లేదని, రాష్ట్ర ప్రయోజనాల ముసుగులో రాజకీయ ప్రయోజనాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ రెండు పార్టీలు పాకులాడుతున్నాయని అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అమలు చేయడం, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ అమలు చేయడం, విభజన చట్టంలో 108 సెక్షన్, 13 షెడ్యూలు కింద పేర్కొన్న వివిధ అంశాలు అమలు చేయడం వంటివి సాధించాలని తులసిరెడ్డి చెప్పారు. వీటిని కేంద్ర ప్రభుత్వం మాత్రమే అమలు చేయగలుగుతుందని, అంటే వీటిని అమలు చేసే శక్తి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మాత్రమే ఉందని అన్నారు. ప్రస్తుతం బీజేపీకి అమలు చేసే అవకాశం ఉందని, అధికారంలో ఉండి కూడా అమలు చేయడం లేదని వ్యాఖ్యానించారు.
ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని తులసిరెడ్డి అన్నారు. నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నంత కాలం, బీజేపీ అధికారంలో ఉన్నంత కాలం ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టం అమలు కావని సృష్టంగా తెలుస్తోందన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వీటిని చేస్తామని 84వ ప్లీనరీలో రాజకీయ తీర్మానం చేశామని అన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ, వైసీపీలకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమైతే రాబోయే లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్‌కి స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించాలని, అప్పుడే ప్రజలు ఈ రెండు పార్టీల చిత్తశుద్ధిని విశ్వసిస్తారని వ్యాఖ్యానించారు.
అలా కాకుండా మిగతా ఎన్ని విన్యాసాలు చేసినా అది రాజకీయ ప్రయోజనాల కోసమే తప్పా, రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని అర్థమవుతుందన్నారు. మూడు సంవత్సరాల 9 నెలలుగా తెలుగు దేశం పార్టీ అధికార మిత్ర పక్షంగా, వైసీపీ అనధికార మిత్రపక్షంగా బీజేపీకి పనిచేశాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వ చివరి బడ్జెట్లో కూడా రాష్ట్రానికి అన్యాయం జరగడంతో బీజేపీ పట్ల రాష్ట్ర ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందని అన్నారు.
ఈ ఆగ్రహం తమ మీద పడకుండా తప్పించుకునేందుకు, బీజేపీపై ఆగ్రహం కాంగ్రెస్‌కు అనుకూలంగా మారకుండా చూసేందుకు టీడీపీ, వైసీపీలు రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయి తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని సృష్టమవుతుందన్నారు. ఏది ఏమైనా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలను అమలు చేయడం తథ్యమని తులసిరెడ్డి అన్నారు.