Salman Khan: ‘ఐ సపోర్ట్ సల్మాన్’ అన్న కోన వెంకట్ కు నెటిజన్ల చురకలు!
- సల్మాన్ కేసులో కోర్టు తీర్పు విని ఆశ్చర్యపోయా
- ఇప్పుడు సల్మాన్ వ్యక్తిత్వంపై చర్చ జరపాల్సిన అవసరం లేదు
- జంతువుల వేటను చాలా దేశాల్లో అనుమతిస్తున్నారు
కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ కు శిక్ష పడటంపై బాలీవుడ్ నటులు ఇప్పటికే తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై మన పొరుగు దేశమైన పాకిస్థాన్ విపరీత వ్యాఖ్యలు చేయడం విదితమే. తాజాగా, సల్మాన్ కు శిక్ష పడటంపై టాలీవుడ్ మాటల రచయిత కోన వెంకట్ స్పందించారు.
‘ఐ సపోర్ట్ సల్మాన్’ అనే హ్యాష్ టాగ్ తో కోన వెంకట్ ఓ ట్వీట్ చేశారు. ‘సల్మాన్ కేసులో కోర్టు తీర్పు విని ఆశ్చర్యపోయాను... దోషిగా తేలినంత మాత్రాన సల్మాన్ వ్యక్తిత్వంపై చర్చ జరపాల్సిన అవసరం లేదు .. పర్యావరణ సమతుల్యతను కాపాడే నిమిత్తం జంతువుల వేటను చాలా దేశాల్లో ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి.. మొదట మనుషులను కాపాడాలి..’ అంటూ కోన వెంకట్ అభిప్రాయపడ్డారు.
కాగా, ఈ పోస్ట్ పై నెటిజన్లు భిన్న వ్యాఖ్యలు చేశారు. ‘నిజమైన మనుషులు తమ సరదా కోసం జంతువులను వేటాడరు’, ‘వన్యప్రాణి సంరక్షణ చట్టాలు చదువుకో ఇంటర్నెట్ లో ఉంటాయి’, ‘మీలాంటి సెలెబ్రిటీల కోసం చట్టాలు, నిబంధనలు మార్చుకోవాలా!!! మా భారతదేశంలో అయితే ఇలాంటివి అనుమతించరు సార్. కావాలంటే వేరే దేశాలకు మీరు వెళ్లి వేటాడుకోండి’ అంటూ చురకలు అంటించారు.