Chandrababu: ఎవరి రాజధాని అని పుస్తకాలు రాస్తున్నారు?: చంద్రబాబు
- రాజధాని భావితరాల కోసమే
- కొందరు రాష్ట్రాభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తున్నారు
- తమిళనాడుకు చెన్నై, తెలంగాణకు హైదరాబాద్ లాంటివి ఉన్నాయి
- ఏపీకి అమరావతి ఉండకూడదా?
'ఎవరి రాజధాని అమరావతి' అని కొందరు పుస్తకాలు రాస్తున్నారని, తాను కట్టే ప్రజా రాజధాని భావితరాల కోసమేనని, కొందరు రాష్ట్రాభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు రాసిన ‘ఎవరి రాజధాని అమరావతి’ పుస్తకాన్ని నిన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ విషయంపైనే చంద్రబాబు ఇలా విమర్శలు చేశారు.
అప్పట్లో ఐవైఆర్ కృష్ణారావు రాజధాని బ్రహ్మాండంగా నిర్మిస్తున్నారని అన్నారని, ఇప్పుడేమో ఇలా పుస్తకాలు రాస్తున్నారని, ఆయన వెనుక ఎవరు ఉన్నారని చంద్రబాబు ప్రశ్నించారు. తమిళనాడుకు చెన్నై, కర్ణాటకకు బెంగళూరు, ఢిల్లీకి ఢిల్లీ, మహారాష్ట్రకు ముంబై, తెలంగాణకు హైదరాబాద్ లాంటి గొప్ప నగరాలు ఉన్నాయని, కానీ.. ఏపీకి అమరావతి ఉండకూడదా? అని ప్రశ్నించారు.
ఒక నాయకుడు రాజధాని నిర్మాణానికి ఇంత భూమి ఎందుకని మాట్లాడుతున్నారని, 'అసలు ఏంటి మీ ఉద్దేశం?' అని చంద్రబాబు ప్రశ్నించారు. ఆనాడు ఒకవేళ అందరి విమర్శలను పట్టించుకుని, తాను హైదరాబాద్‌ను అభివృద్ధి చేసి ఉండకపోతే ఈ రోజు ఆ నగరం ఇంతటి స్థాయిలో ఉండేది కాదని అన్నారు. అదే పట్టుదలతో అమరావతిని ప్రజా రాజధానిగా తీర్చిదిద్దుతానని అన్నారు.