Reliance: వినియోగదారుల నెత్తిన పాలు పోసిన జియో.. ఐఎఫ్‌సీ నివేదికలో ఆశ్చర్యపరిచే విషయాలు వెల్లడి!

  • అరంగేట్రంతోనే సంచలనం సృష్టించిన జియో
  • జియో రాకతో వినియోగదారులకు ఊరట
  • ఏటా రూ.64 వేల కోట్ల ఆదా
  • రూ.150 నుంచి రూ.10కి పడిపోయిన డేటా ధర

అరంగేట్రంతోనే సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్ జియో రాకతో దేశానికి ఎంతో మేలు జరిగిందని ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ కాంపిటీటివ్‌నెస్‌(ఐఎఫ్‌సీ) పేర్కొంది. జియో రాకతో ప్రతి ఏటా వినియోగదారులకు రూ.64 వేల కోట్లు ఆదా అయిందని తెలిపింది. అంతేకాదు, తలససరి జీడీపీ కూడా పెరిగిందని వెల్లడించింది. సెప్టెంబరు 2016లో టెలికం రంగంలోకి ప్రవేశించిన జియో ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టించింది.

తొలుత ఉచితంగా సేవలు అందించిన జియో తర్వాత అతి తక్కువ ధరకే డేటాను అందిస్తూ వినియోగదారుల మనసులు దోచుకుంది. అంతేకాదు, అపరిమితంగా వాయిస్ కాల్స్ చేసుకునే వెసులుబాటును తీసుకొచ్చింది. దీంతో టెలికం రంగంలో ప్రకంపనలు మొదలయ్యాయి.

ఖాతాదారులను కాపాడుకోలేక ఇతర సంస్థలు నానా తంటాలు పడ్డాయి. మరో దారిలేక జియోను ఎదుర్కొనేందుకు టారిఫ్‌లను తగ్గించుకున్నాయి. ఫలితంగా డేటా చార్జీలు గణనీయంగా తగ్గాయి. ఒకప్పుడు 1జీబీ డేటాకు ఇంచుమించుగా రూ.150 చెల్లించాల్సి వచ్చేది. జియో రాకతో అది ఏకంగా రూ.10కి పడిపోయింది.

చాలామందికి అందని ద్రాక్షగా మారిన డేటాను జియో ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకొచ్చింది. డేటా కోసం పెట్టే ఖర్చు గణనీయంగా తగ్గింది. ఫలితంగా ఏటా దాదాపు రూ.64 వేల కోట్లు ఆదా అయినట్టు ఐఎఫ్‌సీ తన నివేదికలో పేర్కొంది.  జియో రాకతో టెలికం రంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నట్టు ఐఎఫ్‌సీ నివేదిక వెల్లడించింది. మార్కెట్లోకి జియో అడుగుపెట్టిన ఆరు నెలల్లోనే ప్రపంచంలోనే అత్యధిక మొబైల్ డేటాను ఉపయోగిస్తున్న దేశంగా భారత్ రికార్డులకెక్కింది.

  • Loading...

More Telugu News