Salman Khan: సల్మాన్ బెయిల్ పై నిర్ణయం నేడే!
- సల్మాన్ బెయిల్ పై వాదనలు విన్న న్యాయస్థానం
- విచారణలో లోపాలున్నాయన్న సల్మాన్ న్యాయవాదులు
- సల్మాన్ నేరం నిరూపించామన్న ప్రభుత్వ న్యాయవాది
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ బెయిల్ పై జోధ్ పూర్ సెషన్స్ కోర్టు నేడు నిర్ణయం వెలువరించనుంది. కృష్ణజింకల వేట కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడిన సల్మాన్, జోధ్ పూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన శిక్షను నిలుపుదల చేసి, బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాదులు పిటిషన్ వేశారు. దీనిపై న్యాయస్థానం వాదనలు వింది. సల్మాన్ తరపు న్యాయవాదులు, విచారణలో ఎన్నో లోపాలున్నాయని, ఈ కేసులో సల్మాన్ ఆయుధాలు ఉపయోగించినట్లు ఎక్కడా రుజువు కాలేదని వాదించారు.
ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులను విశ్వసించలేమని చెబుతూ, వేటకు సంబంధించిన మిగతా కేసుల్లో సల్మాన్ పై అభియోగాలేవీ రుజువు కాలేదని న్యాయస్థానానికి గుర్తుచేశారు. ఈ సమయంలో కలుగజేసుకున్న ప్రభుత్వ న్యాయవాది, కేవలం ఈ కేసులోనే ప్రత్యక్ష సాక్షులు అందుబాటులో ఉన్నారని, ఏ సందేహానికీ తావు లేకుండా సల్మాన్ నేరాన్ని రుజువు చేయగలిగామని పేర్కొన్నారు. కావాలంటే ట్రయల్ కోర్టు నుంచి కేసు రికార్డును తెప్పించుకుని పరిశీలించాలని న్యాయస్థానాన్ని కోరారు. దీంతో మేజిస్ట్రేట్ ట్రయల్ కోర్టు నుంచి రికార్డు తేవాలని సూచించారు. దానిని పరిశీలించిన తరువాత నిర్ణయం చెబుతామన్నారు. దీంతో నేడు సల్మాన్ బెయిల్ పై నిర్ణయం వెలువడనుందని తెలుస్తోంది.