Pawan Kalyan: ప్రపంచపటంలో ఇండియా మెరుస్తూ వుండవచ్చు.. కానీ..!: పవన్ కల్యాణ్
- రాజకీయ వ్యవస్థలోని అవినీతి.. వ్యవస్థను నాశనం చేస్తోంది
- ప్రజలకు కనీసం స్వచ్ఛమైన గాలి కూడా దొరకడం లేదు
- ప్రాథమిక హక్కుల కోసం కూడా ప్రజలు పోరాడే పరిస్థితి వస్తుంది
భారతదేశ ఎకానమీ, వ్యవస్థ లోపాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మన దేశ ఎకానమీ పెరుగుతూ ఉండవచ్చు, ప్రపంచ వేదికపై ఇండియా మెరుస్తూ ఉండవచ్చు... కానీ రాజకీయ వ్యవస్థలో నెలకొన్న అవినీతి దేశాన్ని దిగజార్చుతోందని ఆయన అన్నారు. ప్రజల పట్ల, వ్యవస్థ పట్ల రాజకీయనేతలకు ఎలాంటి పట్టింపులు లేకపోవడం మన వ్యవస్థను నాశనం చేస్తోందని తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీ సహా దేశమంతా స్వచ్ఛమైన గాలి కూడా లేక ఇబ్బంది పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదాహరణకు ఏపీలోని తుండూరు ఆక్వా పార్కును తీసుకోవచ్చని అన్నారు. ఆ ప్రాంతానికి చెందిన యువకులు తనను కలిశారని... కనీసం స్వచ్ఛమైన గాలి, నీరు కూడా తమకు లేకుండా చేస్తున్నారని వారు తన వద్ద ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు.
ఎంతో అనుభవం ఉన్న రాజకీయ నేతలు చేస్తున్న ఎక్స్ పెరిమెంట్స్ వ్యవస్థకు మంచి చేయకపోగా, కీడు చేస్తున్నాయని పవన్ అన్నారు. లోపభూయిష్టమైన పబ్లిక్ పాలసీలు, స్థిరంగా లేని ఆర్థిక ఎదుగుదల, బలహీనవర్గాలపై బలంగా పని చేసే చట్టాలు, బలంగా ఉన్నవారిపై బలహీనంగా పని చేసే చట్టాలు ఇలా ఎన్నో అంశాలు వ్యవస్థను పీడిస్తున్నాయని తెలిపారు. ఇది ఇలాగే కొనసాగితే... ప్రాథమిక హక్కుల కోసం కూడా ప్రజలు పోరాడాల్సి వస్తుందని హెచ్చరించారు. దేశంలోని కోట్లాది మంది ప్రజలు ఇదే భావనలో ఉన్నారని ట్విట్టర్ ద్వారా తెలిపారు.