sbi: ప్రభుత్వ బ్యాంకులను బలోపేతం చేసిన తర్వాతే ప్రైవేటీకరణ చేస్తే బావుంటుంది: ఎస్ బీఐ చైర్మన్
- ప్రైవేటీకరణకు ఇప్పుడు అనుకూల సమయం కాదు
- వాటిని ఆర్థికంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దాల్సి ఉంది
- ఇందుకు రెండేళ్ల సమయం పడుతుంది
ఎస్ బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు అనుకూలంగా మాట్లాడారు. అయితే, ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు ఇది సరైన సమయం కాదన్నారు. వాటిని ఆర్థికంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన తర్వాత విక్రయిస్తే బావుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియా మాదిరిగా పూర్తిగా అప్పుల్లో మునిగిపోకముందే ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలని ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని సహా పలువురు ప్రముఖులు సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా ఎస్ బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ ఈ అంశంపై స్పందించారు.
‘‘అందుకు ప్రస్తుతం సరైన సమయం కాదు. ఎందుకంటే బ్యాంకులను బలోపేతం చేసేందుకు సమయం పడుతుంది. బ్యాంకింగ్ రంగం ప్రస్తుతం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పీఎన్ బీలో స్కామ్ తర్వాత ప్రైవేటీకరణ అంశంలో మార్కెట్లు సానుకూలంగా లేవు. కనుక ప్రైవేటీకరణ చేసే ముందు బ్యాంకులను మరింత బలోపేతం చేయాలి. అప్పుడే వాటికి సరైన ధర వస్తుంది’’ అని రజనీష్ కుమార్ పేర్కొన్నారు. బ్యాంకులను బలోపేతం చేసేందుకు కనీసం రెండేళ్లు తీసుకుంటుందని చెప్పారు. అయితే, ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరిస్తే సామాజిక లక్ష్యాల సాధనకు విఘాతం కలగొచ్చని, ఎస్ బీఐ ఒక్కటే అన్ని లక్ష్యాలను నెరవేర్చలేదన్నారు.