ipl: ఐపీఎల్ ఒక్కో జట్టుపై రూ.40 కోట్ల ఇన్సూరెన్స్... మొత్తం బీమా రూ.2,500 కోట్లు
- గతేడాది కంటే రెట్టింపైన బీమా కవరేజీ
- ఆటగాళ్ల గాయాలకూ కవరేజీ
- మ్యాచ్ లు ఆలస్యం, జాప్యం అయితే జరిగే నష్టంపైనా బీమా రక్షణ
ఈ ఏడాది ఐపీఎల్ ట్వంటీ20 క్రికెట్ లీగ్ బీమా కంపెనీలకు కాసులు కురిపిస్తోంది. నేటి నుంచి మే 27 వరకు ఐపీఎల్ సీజన్ కొనసాగనున్న విషయం తెలిసిందే. ఈ సీజన్ కోసం అన్ని కేటగిరీల్లో కలిపి ఏకంగా రూ.2,500 కోట్లకు ఇన్సూరెన్స్ కవరేజీ తీసుకోవడం విశేషం. గతేడాది జరిగిన బీమా రూ1,300 కోట్లు కాగా, ఈసారి ఏకంగా రెట్టింపు కావడం గమనార్హం. ఒక్కో ఐపీఎల్ జట్టుపై రూ.40 కోట్ల బీమా తీసుకున్నారు. ఐపీఎల్ ఈవెంట్ కోసం ప్రసార మాధ్యమాలు తీసుకున్న రూ.1,500 కోట్ల బీమా కవరేజీ కూడా ఇందులో ఉంది. ఒకవేళ ఐపీఎల్ మ్యాచ్ లు కేన్సిల్ అయినా, ఆలస్యమైనా అందుకు వాటిల్లే నష్టాన్ని బీమా పరిహారం రూపంలో పూడ్చుకునేందుకు కంపెనీలు ఈ స్థాయిలో బీమా తీసుకున్నాయి. ఇక మ్యాచ్ ల సమయంలో ఆటగాళ్లకు అయ్యే గాయాలకు కూడా కవరేజీ ఉంది. ఆటగాళ్ల ఫీజుల నష్టంపైనా బీమా తీసుకోవడం విశేషం. పరిహారం కోసం క్లెయిమ్ లు పెరిగిపోవడంతో ఈ ఏడాది బీమా సంస్థలు పాలసీల ప్రీమియాన్ని పెంచేశాయి.