Warangal Rural District: 82 ఏళ్ల వయసులో యుద్ధం చేస్తూ మరణించిన రుద్రమదేవి... లభ్యమైన తిరుగులేని ఆధారం ఇదే!
- వరంగల్ కోటలో బయల్పడ్డ రెండు శిల్పాలు
- నేలపై ఉన్న పురుషుడితో యుద్ధం చేస్తున్నట్టున్న రుద్రమ
- ఆమె యుద్ధంలోనే వీరమరణం పొందిందంటున్న చరిత్రకారులు
కాకతీయ సామ్రాజ్యాధినేత రుద్రమదేవి, తన 82 సంవత్సరాల వయసులో అంబదేవుడితో పోరాటం చేస్తూ వీరమరణం పొందినట్టు ఓ తిరుగులేని ఆధారాన్ని పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. గతంలో నల్గొండ జిల్లా చందుపట్లలో వెలుగులోకి వచ్చిన ఓ శాసనం ఆమె 1289 నవంబరులో మరణించినట్టు తెలుపగా, ఆమె వీరమరణం పొందినట్టు నమ్ముతున్న చరిత్ర కారుల ముందు మిస్టరీ మిగిలింది.
ఇక తాజాగా వరంగల్ కోటలోని బొల్లికుంటలో రెండు శిల్పాల్లో ఆమె మరణాన్ని సూచిస్తూ రెండు శిల్పాలు కనిపించాయి. ఈ శిల్పాల్లో గుర్రంపై ఉన్న రుద్రమ, కత్తి తిప్పుడూ, నేలపై ఉన్న పురుషుడితో యుద్ధం చేస్తున్నట్టు ఉంది. ఆ వ్యక్తి అంబదేవుడేనని పీవీ పరబ్రహ్మ శాస్త్రి తెలిపారు. ఆమె సమకాలీకులు ఈ శిల్పాన్ని చెక్కించారని తేల్చారు. అయితే, సామంతరాజైన అంబదేవుడి చేతిలో రుద్రమ మరణించినట్టు శాసనాలను చెక్కించడం అప్పటికే రాజుగా పాలిస్తున్న ప్రతాప రుద్రుడికి ఇష్టం లేకనే శాసనాలు, శిల్పాల్లో పేర్కొనక పోయి ఉండవచ్చని భావిస్తున్నట్టు చరిత్రకారులు వ్యాఖ్యానించారు.
ఇక తాజాగా లభ్యమైన శిల్పంలో సైనిక దుస్తులు, రక్షణ కవచంతో ఉన్న రుద్రమ విసిరిన ఆయుధం గురితప్పినట్టుగా, నేలపై ఉన్న అంబదేవుడు ఖడ్గంతో దాడి చేస్తున్నట్టుగా ఉంది. అదే యుధ్దంలో పాల్గొని బతికిన ఓ సైనికుడు ఈ శిల్పాన్ని చెక్కించి ఉంటారని అంచనా. ఆ శిల్పాన్ని మీరూ చూడవచ్చు.