BJP: కర్ణాటక ఎన్నికలు కాగానే బీజేపీ నాపైకి వచ్చేస్తుంది... ధైర్యంగా ఎదుర్కొంటా: చంద్రబాబు
- బీజేపీ లక్ష్యం నేనే
- తాడో పేడో తేల్చుకుంటా
- నైతికంగా బలంగా ఉన్నాం
- అఖిలపక్ష సమావేశంలో చంద్రబాబు
మరో నెల రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే భారతీయ జనతా పార్టీ పెద్దలు ఆంధ్రప్రదేశ్ కు వస్తారని, తనను లక్ష్యంగా చేసుకుంటారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి వచ్చిన నేతలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, కేంద్రంతో తాడో పేడో తేల్చుకోవాలన్నదే తన ఉద్దేశమని అన్నారు.
బీజేపీ నేతలు రాష్ట్రంపై పడేందుకు సిద్ధంగా ఉన్నారని, అయితే, నైతికంగా చాలా బలంగా ఉన్న రాష్ట్రంతో పెట్టుకుంటే వాళ్లే నష్టపోతారని అన్నారు. తాను ఎన్నో పోరాటాలు చేశానని, విజయం సాధించే వరకూ రాజీపడేది లేదని వ్యాఖ్యానించిన ఆయన, రాష్ట్రానికి నిధులను విడుదల చేయకుండా కేంద్రం ఓ దస్త్రాన్ని తొక్కి పెట్టిందని ఆరోపించారు. బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు లాలూచీ పడ్డాయని, జగన్ ఉచ్చులో ఎవరూ పడొద్దని ఈ సమావేశానికి హాజరైన వివిధ సంఘాల ప్రతినిధులకు సూచించారు. రాష్ట్రంలోని ముసుగు వీరులను చూసుకునే బీజేపీ వాళ్లు ధైర్యం తెచ్చుకున్నారని, రాష్ట్రంతో ఆడుకోవాలని భావిస్తున్న వారి ఆటలు సాగనివ్వబోనని, వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో బీజేపీకి ఒక్క ఓటు కూడా పడదని అన్నారు.
బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వాడుతున్న పదజాలాన్ని జాతీయ స్థాయిలో ఏ నేత కూడా ఇంతవరకూ వాడలేదని చంద్రబాబు నిప్పులు చెరిగారు. కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించిన రాగాల వెంకట రాహుల్ ను చూసి ఢిల్లీలోని పెద్దలు బాధ పడుతూ ఉండవచ్చని వ్యాఖ్యానించిన చంద్రబాబు, ఇకపై పతకాలన్నీ సింధు, శ్రీకాంత్ వంటి మన క్రీడాకారులకే వస్తాయని అన్నారు.