Tamilnadu: నీళ్లు లేక ఏడుస్తుంటే... ఐపీఎల్ ఏంటి?: రజనీకాంత్ తీవ్ర విమర్శలు
- తాగునీటికి ఇబ్బందులు పడుతుంటే క్రికెట్ ఎందుకు?
- ఆటగాళ్లు కనీసం నల్ల బ్యాడ్జీలైనా ధరించాలి
- మీడియాతో సూపర్ స్టార్ రజనీకాంత్
ఓ వైపు రాష్ట్రంలో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతూ, కావేరీ నదీ జలాల కోసం నిరసనలు తెలియజేస్తున్న వేళ, ఐపీఎల్ క్రికెట్ పోటీలు ఎందుకంటూ దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన, కావేరీ నదీ జలాల బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న వేళ, క్రికెట్ పోటీలు జరుగుతూ ఉండటం తనకు ఇబ్బందిని, చిరాకును తెప్పిస్తోందని ఆయన అన్నారు. ఈ పోటీల్లో క్రీడాకారులు ప్రజల నిరసనలకు మద్దతుగా కనీసం నల్ల బ్యాడ్జీలు ధరించి ఆడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. త్వరలోనే ఓ రాజకీయ పార్టీని స్థాపించడం ద్వారా పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తారని భావిస్తున్న రజనీకాంత్, పక్కా రాజకీయ నాయకుడిలా విమర్శలు చేయడం గమనార్హం. కాగా, చెన్నైలోని వాల్లువర్ కొట్టామ్ లో కావేరీ జలాల కోసం జరుగుతున్న నిరసనల్లో నటీనటులు ధనుష్, విజయ్, సూర్య, సత్యరాజ్, శివకుమార్, నాజర్, విశాల్, కార్తీ, శివకార్తికేయన్ తదితరులు పాల్గొనగా, వీరి దీక్షా శిబిరం వద్దకు కమల్, రజనీ వచ్చి మద్దతు పలుకుతారని తెలుస్తోంది.