YS Vijayamma: రాజశేఖరరెడ్డే బతికుంటే విభజనే జరిగేది కాదు... మాటిస్తే నిలబడాలి: విజయమ్మ
- ఆమరణ దీక్ష చేస్తున్న ఎంపీలకు విజయమ్మ పరామర్శ
- సమైక్యంగా ఉండాలన్నదే వైఎస్ కోరిక
- జగన్ కూడా అదే ఆలోచనతో ఉండేవాడు
- ఏపీని ఆటబొమ్మగా చేసుకున్న కాంగ్రెస్, బీజేపీ
- విజయమ్మ విమర్శలు
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి బతికుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయేదే కాదని, పరిస్థితి ఇంతవరకూ వచ్చి ఉండేది కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం న్యూఢిల్లీకి వచ్చి ఆమరణ దీక్ష చేస్తున్న వైసీపీ ఎంపీలను ఆమె పరామర్శించారు. వారి యోగక్షేమాలను దీక్ష జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆమె ప్రసంగిస్తూ, తెలుగు ప్రజలంతా సమైక్యంగా ఉండాలని ఆకాంక్షించిన వ్యక్తి రాజశేఖరరెడ్డి అని గుర్తు చేసుకున్నారు. మాటిస్తే నిలబడాలని నమ్మే వ్యక్తి ఆయనని, అదే గుణం జగన్ లోనూ ఉందని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న ఉద్దేశంతో జగన్ ఎంతో శ్రమించారని, విడిపోయిన తరువాత కూడా ప్రత్యేక హోదాతోనే న్యాయం జరుగుతుందని తొలి నుంచి నమ్మిన ఏకైక పార్టీ వైకాపాయేనని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ తదితర అన్ని పార్టీలూ కలసి ఏపీని ఆటబొమ్మగా చేసుకున్నాయని ఆరోపించారు.
ఆనాడు కేవలం జగన్ ను అణగదొక్కాలన్న కారణంతోనే రాష్ట్రాన్ని విభజించారని, ఇచ్చిన ఏ హామీనీ కేంద్రం నెరవేర్చలేదని అన్నారు. వైకాపా ఎంపీలు చేస్తున్న పోరాటానికి ప్రజలంతా మద్దతివ్వాలని కోరారు. ఆనాడే విభజన హామీలను చట్టం రూపంలో తీసుకుని వచ్చుంటే, నేడు ఇలాంటి నిరసనలు జరిగి ఉండేవి కావని విజయమ్మ అభిప్రాయపడ్డారు.