Sri Reddy: ఆమెకు సభ్యత్వం ఇవ్వబోము... శ్రీరెడ్డితో కలసి నటిస్తే 'మా' నుంచి బహిష్కరణ: శివాజీ రాజా సంచలన ప్రకటన
- చీప్ పబ్లిసిటీ కోసమే దిగజారుడుతనం
- ఆమెతో నటిస్తే 'మా' నుంచి బహిష్కరణ వేటు
- సినిమా అవకాశాలన్నీ దూరమైనట్టే: శివాజీ రాజా
బట్టలిప్పుకుని తిరిగితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో సభ్యత్వం రాదని, కేవలం చీప్ పబ్లిసిటీ కోసమే శ్రీరెడ్డి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ, అర్థనగ్నంగా తిరిగిందని 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా వ్యాఖ్యానించాడు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ అమ్మాయికి సభ్యత్వం ఇవ్వడం జరగని పనని తేల్చి చెప్పారు. 'మా' అసోసియేషన్లో ఉన్న 900 మంది సభ్యులు శ్రీరెడ్డితో నటించబోరని, ఒకవేళ ఎవరైనా ఆమెతో నటిస్తే అసోసియేషన్ నుంచి వారిని తొలగిస్తామని హెచ్చరించారు. మూవీ ఆర్టిస్ అసోషియేషన్ లో సభ్యత్వం కావాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయని, అవి ఎవరికైనా ఒకటేనని అన్నారు. అనవసరంగా ఆమె తెలంగాణ ప్రభుత్వాన్ని తెరపైకి లాగుతోందని ఆరోపించారు. హీరోయిన్లు చిన్నవారైనా, పెద్దవారైనా ఏ సమస్య వచ్చినా తాము పరిష్కరిస్తున్నామని చెప్పారు. ప్రముఖ డైరెక్టర్ తేజ ఆమెకు రెండు అవకాశాలు ఇచ్చారని, ఆనందంగా వాటిని చేసుకోక, టీవీ చానల్స్ కు ఎక్కి విమర్శలు గుప్పిస్తుంటే చూస్తూ ఊరుకోబోయేది లేదని, ఇప్పుడు ఆ రెండు అవకాశాలు కూడా ఆమెకు దూరమైనట్టేనని అన్నారు.