Uttar Pradesh: యూపీ బీజేపీ ఎమ్మెల్యేపై అత్యాచార ఆరోపణ .. సీఎం ఇంటిముందు మహిళ ఆత్మహత్యాయత్నం!
- కుల్ దీప్ సింగ్ సెంగార్ ఏడాది క్రితం నాపై అత్యాచారం చేశాడు
- పోలీస్ స్టేషన్ లో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు
- సీఎం యోగి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు : బాధితురాలు
ఉత్తరప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే కుల్ దీప్ సింగ్ సెంగార్ తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఇంటి ముందు ఓ మహిళ తన కుటుంబంతో సహా ఈరోజు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన గురించి బాధిత మహిళ మాట్లాడుతూ, ఏడాది క్రితం కుల్ దీప్ సింగ్ తనపై అత్యాచారం చేశాడని, ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోయింది.
ఈ సంఘటనపై ఎఫ్ ఐఆర్ నమోదైతే తనను, తన కుటుంబాన్ని చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని, ఈ విషయాన్ని సీఎం యోగి ఆదిత్యానాథ్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదని తెలిపింది. తనకు న్యాయం జరగడం లేదని, ఈ వ్యవహారంలో సంబంధమున్న అందరినీ శిక్షించకపోతే తాను చచ్చిపోతానంటూ బాధితురాలు కన్నీటి పర్యంతమైంది.
కాగా, ఈ కేసుపై లక్నో జోన్ అదనపు డీజీపీ రాజీవ్ కిషన్ మాట్లాడుతూ, ఈ వ్యవహారం ఇప్పటి వరకూ తేలకపోవడం వాస్తవమేనని అన్నారు. ఈ కేసును లక్నో న్యాయస్థానానికి అప్పగించారని, విచారణ జరిగితే గానీ ఎలాంటి చర్యలు తీసుకోలేమని తెలిపారు. బాధితురాలి కుటుంబంపై దాడి జరిగిన విషయమై తమకు ఫిర్యాదు అందిందని, దీనిపై విచారణ జరిపిస్తామని తెలిపారు.