MAA: 'మా' తీసుకున్న నిర్ణయంపై శ్రీరెడ్డి రియాక్షన్ ఇది!
- 'మా'లో అనుకూలంగా ఉన్నవారికే సభ్యత్వం
- మానసిక క్షోభతోనే నిరసన తెలిపాను
- తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు
- 'మా' పెద్దలపై మండిపడ్డ శ్రీరెడ్డి
తమకు అనుకూలంగా ఉన్న వారికే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో సభ్యత్వాలు ఇస్తుంటారని నటి శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది. ఫిల్మ్ చాంబర్ వద్ద ఆమె నిరసన మొత్తం చిత్ర పరిశ్రమలోనే హాట్ టాపిక్ గా మారగా, 'మా' అత్యవసర సమావేశం జరిపి, ఆమెకు సభ్యత్వం ఇవ్వరాదని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
దీనిపై ఈ ఉదయం శ్రీరెడ్డి ఓ టీవీ చానల్ తో మాట్లాడింది. తాను ఎంత మానసిక క్షోభను అనుభవిస్తే, ఇలా చేయాలన్న నిర్ణయానికి వచ్చానో ఒక్కసారి ఆలోచించాలని కోరింది. రేపు తన పిల్లలు ఇలా ఎందుకు చేశావమ్మా? అని ప్రశ్నిస్తే ఏం చెప్పాలో తెలియడం లేదని కన్నీరు పెట్టుకుంది. ఈ ఘటన చూసిన తరువాత తన తల్లి ఏడ్చిందని, కనీసం ఆమె ముందు తాను బట్టలు కూడా మార్చుకోలేదని, అటువంటిది ఇప్పుడు ప్రతి ఒక్కరి సెల్ ఫోన్లో తన ఫోటోలు చేరిపోవడంతో తన తల్లిదండ్రులు కుమిలిపోతున్నారని వాపోయింది.
తన బాధ ఎవరికీ చెప్పుకోలేకనే ఇలా మీడియా ముందుకు వచ్చానని, తన తమ్ముడు తనను చూసి ఏడ్చాడని చెప్పింది. తాను ఎవరినీ బ్లాక్ మెయిల్ చేయలేదని, మూడేళ్ల నుంచి ప్రయత్నిస్తున్నా తనకు సభ్యత్వం ఇవ్వలేదని విమర్శలు గుప్పించింది. ఓ విధానం లేకుండా ఇవ్వాలనుకున్న వారికి మాత్రమే సభ్యత్వం ఇస్తున్నారని, పద్ధతి, పాడు లేకుండా చేస్తున్నారని చెప్పింది. ఒకటి, రెండు సినిమాలు చేసే వారు లక్ష రూపాయలు ఎక్కడి నుంచి తేవాలని ప్రశ్నించింది. ఓ పెత్తందారీ వ్యవస్థలా 'మా'ను నడిపిస్తున్నారని ఆరోపించింది.
తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని, తనను ఎంతమంది వేధించారో 'మా'కు తెలుసా? అని ప్రశ్నించింది. తాను ఓ అమ్మాయని కూడా చూడకుండా హేమ రచ్చ రచ్చ చేసిందని, తన బిడ్డల గురించి కూడా ఆమె అలాగే మాట్లాడుతుందా? అని విమర్శించింది. సెక్యూరిటీ అంతంతమాత్రంగా ఉన్న తన ఫోన్ నంబర్లు, అడ్రస్ ను బహిర్గతం చేయడం ఏంటని మండిపడింది.