Uttar Pradesh: ఇలా ఎందుకు జరుగుతోంది? యూపీ సీఎంపై మండిపడ్డ మోదీ, అమిత్ షా!
- యూపీలో మారుతున్న పరిస్థితి
- ప్రభుత్వంపై పెరుగుతున్న విమర్శలు
- సీరియస్ గా తీసుకున్న మోదీ, షా
- వివరణ ఇవ్వాలని ఆదిత్యనాథ్ కు ఆదేశం
ఉత్తర ప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలపై బీజేపీ అధిష్ఠానం సీరియస్ గా ఉంది. ఎంతో నమ్మి సీఎంగా యోగి ఆదిత్యనాథ్ కు అవకాశం ఇస్తే, పరిస్థితులు పార్టీకి అననుకూలంగా మారడంపై ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. స్వయంగా సీఎం, డిప్యూటీ సీఎం ఖాళీ చేసిన పార్లమెంట్ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే, అధికారంలో ఉండి కూడా దక్కించుకోలేక పోవడాన్ని ఆ పార్టీ ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతోంది.
ఇదే సమయంలో దళిత ఎంపీలు, తమను అవమానకరంగా చూస్తున్నారని పార్టీ రాష్ట్ర పెద్దలపై ఫిర్యాదు చేస్తుండటాన్ని కూడా మోదీ తీవ్రంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో పర్యటించిన యోగి ఆదిత్యనాథ్ కు మోదీ, అమిత్ షాలు క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం విఫలమవుతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయని, పరిస్థితి మారకుంటే కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని వారు తేల్చి చెప్పినట్టు సమాచారం.
తాను స్వయంగా 11వ తేదీన లక్నోలో పర్యటించి నేతలందరినీ కలిసి రాష్ట్ర ప్రభుత్వంపై వారి అభిప్రాయాన్ని స్వీకరిస్తానని, ఆపై ఓ నిర్ణయానికి వస్తానని షా చెప్పినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఇప్పటికే జరుగుతున్న ఘటనలపై వివరణ ఇవ్వాలని యోగి ఆదిత్యనాథ్ ను ప్రధాని ఆదేశించారు. ఆర్ఎస్ఎస్ నేతలు కృష్ణ గోపాల్, దత్తాత్రేయ హొసబలేలు మూడు రోజుల పాటు యూపీలో పర్యటించి స్థానిక పరిస్థితులపై రిపోర్టును తయారు చేసి మోదీకి అందినట్టు కూడా తెలుస్తోంది.
ఢిల్లీ పర్యటన సాధారణమైన పర్యటనేనని యూపీ సీఎం కార్యాలయం ప్రకటించినప్పటికీ, ఆయనకు పార్టీ పెద్దల నుంచి సీరియస్ వార్నింగ్ వచ్చిందని, సమస్యలన్నీ సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ అయ్యాయని సమాచారం.