Chandrababu: చంద్రబాబును సీబీఐ విచారించబోతోంది: గంటా శ్రీనివాస్
- చంద్రబాబును ఇబ్బంది పెట్టాలని చూస్తున్న బీజేపీ
- సీబీఐని ఉసిగొల్పిందని గంటా ఆరోపణ
- బీజేపీ విమర్శల వెనుక రాజకీయ కుట్ర
- ఏ విచారణకైనా సిద్ధమని వెల్లడి
ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని ఇబ్బందులు పెట్టాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సీబీఐని ఉసిగొల్పినట్టు తమకు సమాచారం ఉందని, ఎటువంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నామని మంత్రి గంటా శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతి అంటూ సీబీఐ అడుగు పెట్టనుందని, ఒకప్పుడు బీజేపీ నేతలైన విష్ణుకుమార్ రాజు వంటివారు ఆ ప్రాజెక్టును ఎంతో మెచ్చుకుని ఇప్పుడు విమర్శిస్తున్నారని, వారి విమర్శల వెనుక కేవలం రాజకీయ కుట్ర మాత్రమే దాగుందని విమర్శించారు.
చంద్రబాబు చుట్టూ ఉచ్చు బిగించాలని మోదీ భావిస్తున్నారని, అపార రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఎవరి ఉచ్చులోనూ పడబోరని అన్నారు. చంద్రబాబును కేసుల్లో ఇరికించాలని ప్రయత్నించిన వైఎస్ రాజశేఖరరెడ్డి విఫలమయ్యారని వ్యాఖ్యానించిన ఆయన, తండ్రి వల్లే కానిది కొడుకు జగన్ వల్ల ఏమవుతుందని ప్రశ్నించారు. ఎప్పుడు ఏం చేయాలో చంద్రబాబుకు బాగా తెలుసునని, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో ఎవరైనా ఆయన తరువాతేనని గంటా శ్రీనివాస్ అన్నారు.