Tirumala: టీటీడీ వివాదాస్పద నిర్ణయం... హుండీ లెక్కింపు బాధ్యతలు ప్రైవేట్ సంస్థకు అప్పగింత!
- ప్రైవేట్ ఏజన్సీకి పరకామణి బాధ్యతలు
- నిర్ణయాన్ని తప్పుపడుతున్న వెంకన్న భక్తులు
- ప్రస్తుతం సేవా భావంతో పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులు
తిరుమల తిరుపతి దేవస్థానం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. కోట్లాది మంది భక్తులు నిత్యమూ వెంకన్నకు సమర్పించుకునే హుండీ కానుకలను లెక్కించే బాధ్యతలను ప్రైవేటు సంస్థకు అప్పగించాలని నిర్ణయించింది. పరకామణి లెక్కింపు బాధ్యతలను ప్రైవేట్ ఏజన్సీకి అప్పగించేందుకు రంగం సిద్ధం కాగా, భక్తులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు.
ప్రస్తుతం హుండీలో పడే కరెన్సీ, బంగారు, వెండి కానుకల మదింపును టీటీడీ ఆధ్వర్యంలో రిటైర్డ్ ప్రభుత్వ, బ్యాంకు ఉద్యోగులు లెక్కిస్తుంటారు. స్వామివారి గర్భాలయం పక్కనే పరకామణిలో ఈ పనులు నిత్యమూ జరుగుతుంటాయి. హుండీ కానుకల లెక్కింపును రిటైర్డ్ ఉద్యోగులు స్వామివారికి తాము చేస్తున్న సేవగా భావించి భక్తితో చేస్తుంటారు. వీరిని పరకామణి సేవకులుగా పిలుస్తుంటారు. ఇక కానుకల లెక్కింపు బాధ్యతలను చేపట్టేందుకు టీటీడీ ఉద్యోగులు ఆసక్తి చూపించడం లేదని చెబుతూ పాలక మండలి ప్రైవేటు ఏజన్సీని తెరపైకి తేవడం గమనార్హం.