airtel: డేటా ప్రియుల కోసం ఎయిర్ టెల్ నుంచి సరికొత్త పథకం!
- రూ.499కే రోజూ 2జీబీ డేటా
- 82 రోజుల పాటు వ్యాలిడిటీ
- కాల్స్, ఎస్ఎంఎస్ లు ఉచితమే
డేటా ఎక్కువగా వినియోగించే కస్టమర్ల కోసం ఎయిర్ టెల్ కొత్త పథకాన్ని ప్రకటించింది. రోజూ 2జీబీ డేటాను కేవలం రూ. 499 రూపాయలకే 82 రోజుల పాటు అందుకోవచ్చు. ఐపీఎల్ సీజన్ సమయంలో ఈ పథకాన్ని లాంచ్ చేయడం గమనార్హం. జియో సహా ఇతర ఆపరేటర్లు కూడా ఐపీఎల్ మ్యాచ్ ల నేపథ్యంలో ప్రత్యేక పథకాలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. బీఎస్ఎన్ఎల్ రూ.248కే 51 రోజుల పాటు రోజూ 3జీబీ డేటా ఆఫర్ ప్రకటించగా, జియో మాత్రం రూ.251 ప్లాన్ లో రోజూ 2జీబీ డేటాను 51 రోజుల పాటు అందిస్తోంది.
దీంతో ఎయిర్ టెల్ కూడా రూ.499 పథకంతో ముందుకు వచ్చింది. ఈ ప్యాక్ ద్వారా యూజర్లు ఎటువంటి ఆటంకాల్లేకుండా మ్యాచ్ లు వీక్షించొచ్చని కంపెనీ తెలిపింది. ఇక ఈ పథకంలో అన్ లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ చేసుకోవచ్చు. అయితే, రోజులో 300 నిమిషాలు, వారంలో 1,000 నిమిషాల పరిమితి ఉంది. రోజుకు 100 ఎస్ఎంఎస్ లు కూడా ఉచితమే. రూ.499 ప్లాన్ లో 82 రోజుల పాటు రోజూ 2 జీబీ డేటా అంటే మొత్తం 164 జీబీ డేటాను పొందొచ్చు.