study: ఒకటో తరగతి సీటుకి లక్ష లంచం.. రెడ్ హ్యాండెడ్ గా అరెస్టు చేసిన సీబీఐ
- చెన్నై కేంద్రీయ విద్యాలయలో 1వ తరగతిలో అడ్మిషన్ కు దరఖాస్తు చేసిన దళిత కుటుంబం
- సీటు కావాలంటే లక్ష రూపాయల లంచం ఇవ్వాల్సిందేనన్న ప్రిన్సిపల్
- సీబీఐకి ఫిర్యాదు చేసిన బాలుడి కుటుంబ సభ్యులు
పిల్లలకు నాణ్యమైన విద్యనందించేందుకు తల్లిదండ్రులు పడే తపనను కొంతమంది డబ్బు చేసుకుంటున్నారు. తాజాగా, చెన్నైలోని కేంద్రీయ విద్యాలయలో 1వ తరగతిలో విద్యార్థిని చేర్చుకునేందుకు ఆ స్కూలు ప్రిన్సిపల్ లక్ష రూపాయల లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు.
ఆ వివరాల్లోకి వెళ్తే.. చెన్నైలోని కేంద్రీయ విద్యాలయ (కేవీ)లో తమ కుమారుడికి సీటు కోసం ఒక దళిత కుటుంబం దరఖాస్తు చేసుకుంది. ఆ కుటుంబ సభ్యులను పిలిపించుకున్న ప్రిన్సిపల్ అనంతన్, స్కూల్ లో అడ్మిషన్ కావాలంటే లక్ష రూపాయల లంచం సమర్పించుకోవాలని స్పష్టం చేశారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు.
ముందస్తు ప్రణాళిక ప్రకారం, ఆ కుటుంబ సభ్యులకు లక్ష రూపాయలు ఇచ్చి ప్రిన్సిపల్ వద్దకు పంపిన సీబీఐ అధికారులు, ఆయన లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా అదుపులోకి తీసుకున్నారు.