ipl: 11 సిక్సులతో రస్సెల్ చెలరేగినా ఫలితం లేకపోయింది!
- సిక్సర్లతో చెలరేగిన ఆండ్రీ రస్సెల్
- మెరుపులు మెరిపించిన శామ్ బిల్లింగ్స్
- సిక్సర్ తో విజయం అందించిన రవీంద్ర జడేజా
సీజన్ లో తొలిసారి 200 పరుగుల పైగా లక్ష్యం నిర్దేశించినప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ ను కోల్ కతా నైట్ రైడర్స్ నిలువరించలేకపోయింది. చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో ఆతిధ్య చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన కోల్ కతా నైట్ రైడర్స్ కు శుభారంభం లభించలేదు.
సునీల్ నరైన్ కేవలం 4 బంతులు ఎదుర్కొని 12 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. లిన్ (22) ఫర్వాలేదనిపించగా, రాబిన్ ఉతప్ప (29) నిలదొక్కుకోలేకపోయాడు. నితీశ్ రాణా (16), రింకూ సింగ్ (2) ఒకరి తరువాత ఒకరు పెవిలియన్ చేరారు. దీంతో ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యతను కెప్టెన్ దినేష్ కార్తీక్ (26), ఆండ్రీ రసెల్ (88) తీసుకున్నారు. దినేష్ కార్తీక్ ఆచితూచి ఆడితే రస్సెల్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 36 బంతులు ఎదుర్కొని ఒక్క బౌండరీ, 11 సిక్సర్లతో 88 పరుగులు చేశాడు.
కేవలం 27 బంతుల వ్యవధిలో పది సిక్సర్లు బాదాడంటే ఎంత ధాటిగా ఆడాడో ఊహించుకోవచ్చు. బ్రావో గణాంకాలన్నింటినీ రస్సెల్ మార్చేశాడు. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించింది. షేన్ వాట్సన్ ( 42) వచ్చిన బంతిని వచ్చినట్టే బౌండరీ లైన్ దాటించడంతో చెన్నై స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అతనికి జతగా ఇన్నింగ్స్ ఆరంభించిన అంబటి రాయుడు (39) ఫర్వాలేదనిపించాడు. రైనా (14), ధోనీ ( 25) విఫలమైనప్పటికీ ఆ ప్రభావం ఇన్సింగ్స్ పై పడకుండా శామ్ బిల్లింగ్స్ (56) ధాటిగా ఆడడంతో లక్ష్యం కరుగుతూ వచ్చింది. కీలక దశలో అతను ఔటైనప్పటికీ రవీంద్ర జడేజా చివరి ఓవర్ లో రాణించి, జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది.