sabbam hari: మాజీ ఎంపీ సబ్బం హరికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్?
- వైయస్ కు వీర విధేయుడు సబ్బం హరి
- గత కొంత కాలంగా చంద్రబాబును ప్రశంసిస్తున్న వైనం
- టీడీపీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న మాజీ ఎంపీ
మాజీ ఎంపీ, విశాఖపట్నం మాజీ మేయర్ సబ్బం హరి టీడీపీలో చేరుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబును సబ్బం హరి పలుమార్లు ప్రశంసించారు. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేనటువంటి సబ్బం హరి టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో, ఆయనకు చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు పార్టీ వర్గాల నుంచి సమాచారం. రానున్న ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి కానీ, విశాఖ ఉత్తర అసెంబ్లీ స్థానం నుంచి కానీ పోటీ చేసే అవకాశం తనకు కల్పించాలని సబ్బం హరి కోరినట్టు తెలుస్తోంది.
దివంగత వైయస్ కు సబ్బం హరి వీర విధేయుడు. 2009లో అనకాపల్లి లోస్ సభ స్థానంలో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి అల్లు అరవింద్ ను ఆయన ఓడించారు. వైయస్ మరణానంతరం జగన్ కు మద్దతు ప్రకటించారు. అయితే, 2014 ఎన్నికల్లో జగన్ గెలిస్తే... యూపీఏకు మద్దతు ఇస్తారని అప్పట్లో ఆయన ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో, సబ్బం హరితో తమకు సంబంధం లేదని వైసీపీ ప్రకటించింది. రాష్ట్ర విభజన సమయంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సబ్బం హరి మద్దతుగా నిలిచారు. కిరణ్ పెట్టిన జై సమైక్యాంధ్ర పార్టీలో కూడా చేరారు. విశాఖ ఎంపీగా నామినేషన్ వేసినప్పటికీ... చివరి క్షణంలో మనసు మార్చుకుని టీడీపీ-బీజేపీల ఉమ్మడి అభ్యర్థి హరిబాబుకు మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.