Bihar: మాజీ సీఎం రబ్రీదేవికి ఒక్క సెక్యూరిటీ గార్డును కూడా లేకుండా చేసిన బీహార్ సర్కారు!
- రబ్రీదేవికి ఇస్తున్న సెక్యూరిటీ తొలగింపు
- సామాన్లు సర్దుకుని వెళ్లిపోయిన 32 మంది జవాన్లు
- తాను, తన సోదరుడు తల్లిని కాపాడుకుంటామన్న తేజస్వీ యాదవ్
బీహార్ లో నితీశ్ కుమార్ తీసుకున్న మరో నిర్ణయం వివాదాస్పదం అయింది. లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి, రాష్ట్రానికి సీఎంగా పని చేసిన రబ్రీదేవికి ప్రభుత్వం ఇచ్చిన 32 మంది మిలటరీ పోలీస్ జవాన్లను వెనక్కు తీసుకుంది. ఆమె ఇంటి ముందు సెక్యూరిటీని ఇస్తున్న పోలీసులు తమ సామాన్లను ప్యాక్ చేసుకుని మంగళవారం రాత్రి వెళ్లిపోగా, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రభుత్వ అధికారులపై నిప్పులు చెరిగారు.
ఇందుకు నిరసనగా తాను, తన సోదరుడు తేజ్ ప్రతాప్ కలసి తమ వ్యక్తిగత సెక్యూరిటీని కూడా వదులుకుంటున్నట్టు తేజస్వీ యాదవ్ తెలిపారు. తాము తమ తల్లిని కాపాడుకోగలమని, కుహనా రాజకీయాలు చేయడం నితీశ్ కు బాగా అలవాటు అయిపోయిందని విమర్శించారు. తమ తల్లి మాజీ ముఖ్యమంత్రని, సోదరుడు తేజ్ ప్రతాప్ ఎమ్మెల్యేగా ఉన్నారని గుర్తు చేశారు. కాగా, ఐఆర్సీటీసీ హోటల్ టెండర్ కేసులో ప్రమేయముందన్న ఆరోపణలతో రబ్రీ నివాసంలో సీబీఐ సోదాలు జరుపగా, ఆ తరువాత నితీశ్ ప్రభుత్వం ఆమెకిస్తున్న సెక్యూరిటీని తొలగించాలని నిర్ణయించింది.
కాగా, తాముంటున్న ఇంటిని కూడా ఖాళీ చేయాలని ప్రభుత్వం నోటీసులు పంపుతోందని, ఇది రాజకీయ కుట్రేనని తేజస్వీ యాదవ్ ఆరోపించారు. నితీశ్ కుమార్ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు.