Rajinikanth: వీటికి వెంటనే అడ్డుకట్ట వేయకపోతే.. దేశ రక్షణకు సవాల్ గా పరిణమిస్తుంది: రజనీకాంత్
- డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడులు మంచిది కాదు
- వీటికి వెంటనే అడ్డుకట్ట వేయాలి
- చట్టాలను మరింత కఠినతరం చేయాలి
చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్ లను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కోల్ కతా నైట్ రైడర్స్ తో చైన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ సందర్భంగా తమిళ సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. మైదానంలోకి చెప్పులు విసిరి కేంద్రంపై వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీలను కొందరు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న సమయంలో... ఖాకీలపై కూడా దాడికి దిగారు. కావేరీ వివాదం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే... చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్ లను నిర్వహిస్తున్నారని మండిపడ్డారు.
ఈ హింసపై సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడులకు దిగడం చాలా దారుణమని ఆయన అన్నారు. ఈ తరహా హింసకు వెంటనే అడ్డుకట్ట వేయాల్సి ఉందని... లేకపోతే మన దేశ రక్షణకు ఇది పెద్ద సవాల్ గా మారుతుందని చెప్పారు. డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడి చేసే వారిని శిక్షించేందుకు... చట్టాలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.