Kidambi Srikanth: చరిత్ర సృష్టించిన కిడాంబి శ్రీకాంత్.. ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్ కైవసం

  • ప్రపంచ నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్న తెలుగు తేజం
  • ఈ ఘనత సాధించిన రెండో భారతీయుడు శ్రీకాంత్
  • భారత బ్యాడ్మింటన్ కు గొప్ప రోజు అన్న గోపీచంద్

తెలుగుతేజం, భారత్ అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ చరిత్ర సృష్టించాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ర్యాకింగ్స్ లో మెన్స్ సింగిల్స్ నంబర్ వన్ స్థానాన్ని శ్రీకాంత్ కైవసం చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన రెండో భారత ఆటగాడిగా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఈ రోజు ప్రకటించిన జాబితాలో 76,895 పాయింట్లతో శ్రీకాంత్ తొలి స్థానంలో నిలిచాడు.

ఇదే సమయంలో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ అక్సెల్సన్ ను రెండో స్థానంలోకి నెట్టేశాడు. 1980లో కంప్యూటరైజ్డ్ ర్యాంకింగ్ పద్ధతి లేనప్పుడు భారత్ కు చెందిన ప్రకాశ్ పదుకునే నంబర్ వన్ స్థానాన్ని సాధించాడు. ఇన్నేళ్ల తర్వాత మరో భారతీయుడు ఈ ఘనతను సాధించడం ఇదే ప్రథమం.

ప్రస్తుత వరల్డ్ టాప్ ఫైవ్ ప్లేయర్స్ వీరే...

కిడాంబి శ్రీకాంత్ - ఇండియా - 76,895 పాయింట్లు
విక్టర్ అక్సెల్సన్ - డెన్మార్క్ - 75,470 పాయింట్లు
సోన్ వాన్ హో - కొరియా - 74,670 పాయింట్లు
చెన్ లాంగ్ - చైనా - 73, 466 పాయింట్లు
షీయుకీ - చైనా - 72,743 పాయింట్లు

ప్రపంచ నంబవర్ వన్ స్థానానికి ఎదిగిన కిడాంబి శ్రీకాంత్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. తొలి స్థానాన్ని సాధించిన రెండో భారతీయుడిగా శ్రీకాంత్ నిలిచినందుకు చాలా గర్వంగా ఉందని మాజీ క్రికెటర్ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. భారతీయ క్రీడా రంగానికి ఈ రోజు గొప్పరోజు అని అన్నాడు.

మరోవైపు పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ, శ్రీకాంత్ కే కాకుండా భారత బ్యాడ్మింటన్ కు ఇదొక గొప్ప విజయమని చెప్పాడు. ఇప్పటి వరకు మనమంతా మహిళా క్రీడాకారుల గురించే మాట్లాడుకున్నామని... ఇప్పుడు మనకు మెన్స్ నెంబర్ వన్ కూడా ఉన్నాడని తెలిపాడు. రానున్న రోజుల్లో శ్రీకాంత్ మరింత మెరుగైన ఆటతీరును ప్రదర్శిస్తాడని చెప్పాడు.

  • Loading...

More Telugu News