Andhra Pradesh: ఏపీని హరితాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలి : ఏపీ సీఎస్ దినేష్ కుమార్
- అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంపై శ్రద్ధ వహించాలి
- అటవీ శాఖాధికారులను ఆదేశించిన దినేష్ కుమార్
- అటవీకరణ, పరిహారం, నిర్వహణ తదితర అంశాలపై సమీక్ష
రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని అటవీ శాఖ అధికారులను ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) దినేష్ కుమార్ ఆదేశించారు. సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని సీఎస్ సమావేశ మందిరంలో అటవీ పునరుద్ధరణ నిధుల నిర్వహణ, ప్రణాళికా సంస్థ (సీఏఎంపీఏ - కాంపెన్ సేటరీ ఎఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్ మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ) 11వ స్టీరింగ్ కమిటీ సమావేశం ఈరోజు నిర్వహించారు.
అటవీకరణ, పరిహారం, నిర్వహణ, నిధుల వినియోగం, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాల మొక్కలు నాటడం, బయోడైవర్సిటీ కన్సర్వేషన్ తదితర అంశాలను సమీక్షించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అటవీకరణ, వివిధ రకాల మొక్కల పెంపకం, టేకు చెట్ల పెంపకం వంటి అంశాలను అధికారులు వివరించారు. ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ, అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంపై శ్రద్ధ వహించాలని, రాష్ట్రంలో పచ్చదనం నింపడం, అటవీ ప్రాంత విస్తరణపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.