Cricket: ఆఖరి బంతి వరకూ నరాలు తెగే ఉత్కంఠ... ముంబై ఇండియన్స్ పై సన్ రైజర్స్ గెలుపు

  • ఒక వికెట్ తేడాతో గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్
  • 147 పరుగులు చేసిన ముంబై ఇండియన్స్
  • చివరి బంతికి ఫోర్ తో రైజర్స్ విజయం

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు హోమ్ గ్రౌండ్ కలిసొచ్చింది. గెలుపు ఓటములు చివరి క్షణం వరకూ ఊగిసలాడిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై ఆఖరి బంతికి సన్ రైజర్స్ విజయం సాధించి, వరుసగా రెండో మ్యాచ్ లోనూ గెలిచింది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులకే పరిమితమైంది. లూయిస్ 29, పొలార్డ్ 28, సూర్యకుమార్ యాదవ్ 28 పరుగులు చేసి రాణించారు. ఆపై 148 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ ఒక దశలో 62 పరుగుల వరకూ వికెట్ నే కోల్పోలేదు.

అయితే స్పిన్ ప్రపంచంలో నయా సంచలనం మయాంక్ మార్కండ్ రంగంలోకి దిగగానే పరిస్థితి మారిపోయింది. ఆ తరువాతి 38 బంతుల్లో కేవలం 39 పరుగులు మాత్రమే చేసి 5 వికెట్లు కోల్పోవడంతో రైజర్స్ జట్టు కష్టాల్లో పడింది. మయాంక్ కు నాలుగు వికెట్లు లభించాయి. ఆపై వచ్చిన ఆటగాళ్లలో హుడా ఓ వైపు నిలిచినా, మరోవైపు వరుసగా వికెట్లు పడిపోయాయి. 9 వికెట్లు పడిపోయిన దశలో ఆఖరి ఓవర్ కు 11 పరుగులు చేయాల్సి వుండగా, ఆఖరి బంతికి రైజర్స్ జట్టు విజయం సాధించింది. తమ తదుపరి మ్యాచ్ ని కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కోల్ కతా నైట్ రైడర్స్ తో ఆడనుంది.

  • Loading...

More Telugu News