Mahaveer Fogat: 'దంగల్' క్లైమాక్స్ కామన్వెల్త్ లో కనిపించింది... బబిత తండ్రి మహావీర్ కు చేదు అనుభవం!
- బబిత ఫైనల్ పోరుకు అందని టికెట్లు
- స్టేడియం బయటే ఆగిన మహావీర్ ఫొగాట్
- చివరి క్షణాల్లో టికెట్ ఇచ్చిన ఆస్ట్రేలియా రెజర్లు
ఇండియన్ రెజ్లర్లు గీత, బబిత ఫొగాట్, వారి తండ్రి మహావీర్ ఫొగాట్ జీవిత చరిత్రపై అమీర్ ఖాన్ హీరోగా నిర్మించిన 'దంగల్' క్లైమాక్స్ గుర్తుందా? సినిమాలో తన కుమార్తె ఫైనల్ పోరును చూడకుండా జట్టు కోచ్ మహావీర్ ను ఓ గదిలో బంధిస్తాడు. సినిమా కోసం కల్పించిన ఆ సీన్ ఇప్పుడు జరిగింది. అయితే, మహావీర్ ను ఎవరూ బంధించలేదుగానీ, అధికారుల నిర్లక్ష్యం కారణంగా తన కుమార్తె స్వర్ణపతకం సాధించిన మ్యాచ్ ని చాలా సేపు ఆయన స్వయంగా వీక్షించలేక స్టేడియం బయటే ఉండిపోవాల్సి వచ్చింది.
గోల్డ్ కోస్ట్ లో జరుగుతున్న కామన్వెల్త్ పోటీల్లో బబిత 53 కేజీల విభాగంలో భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ఫైనల్ పోరును చూసేందుకు మహావీర్ స్టేడియానికి వెళ్లి బయటే ఆగిపోవాల్సి వచ్చింది. తొలి మూడు బౌట్ లనూ ఆయన చూడలేకపోయారు. చివరకు ఆస్ట్రేలియా రెజర్లకు ఇచ్చిన ఓ టికెట్ తో ఆయన లోపలికి వెళ్లి చివరి క్షణాలను మాత్రం చూడగలిగారు. ఈ వ్యవహారంపై అధికారులు స్పందిస్తూ, రెజ్లింగ్ కోచ్ తోమర్ కు తాము ఐదు టికెట్లు ఇచ్చామని, వాటిల్లో ఒకటి మహావీర్ కు ఎందుకు అందలేదో తెలియదని చెప్పారు.
ఇక ప్రతి అథ్లెట్ కూ రెండు టికెట్లు ఇస్తారని గుర్తు చేసిన బబిత, రాత్రి వరకూ తాను ఎన్నిసార్లు ప్రయత్నించినా, అధికారులు తనకు టికెట్లు ఇవ్వలేదని ఆరోపించింది. ఎంత శ్రమించినా, ఎందరిని అడిగినా టికెట్లు రాలేదని, దీంతో తన తండ్రి బయటే ఉండిపోవాల్సి వచ్చిందని వాపోయింది.