Commonwealth Games: గోల్డ్ కోస్ట్ లో కొనసాగుతున్న ఇండియన్ గోల్డ్ హంట్
- కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ పతకాల వేట
- 15 స్వర్ణాలను సాధించిన భారత్
- 50 మీటర్ల మహిళల రైఫిల్ పోటీల్లో స్వర్ణపతకం సాధించిన తేజశ్విని
గోల్డ్ కోస్ట్ లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో నిన్న మెరుగైన ప్రదర్శన చేసిన భారత్... ఈ రోజు 9వ రోజును కూడా ఘనంగా ప్రారంభించింది. మహిళా షూటర్లు పతకాల వేటను కొనసాగించారు. 50 మీటర్ల రైఫిల్ పోటీల్లో తేజశ్విని సావంత్ గోల్డ్ మెడల్ సాధించగా, అంజుమ్ మౌడ్గిల్ రజత పతకాన్ని సాధించింది. ఈ పతకాలతో భారత్ ఇప్పటి వరకు 15 స్వర్ణ, 8 రజత, 10 కాంస్య పతకాలను సాధించి... పతకాల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతోంది. 74 కేజీల రెజ్లింగ్ పోటీల్లో సుశీల్ కుమార్ నిన్న స్వర్ణ పతకాన్ని సాధించాడు. కామన్వెల్త్ గేమ్స్ లో వరుసగా మూడోసారి స్వర్ణాన్ని సాధించి హ్యాట్రిక్ సాధించాడు.
మరోవైపు 63 స్వర్ణ, 46 రజత, 50 కాంస్య పతకాలతో ఆస్ట్రేలియా తొలి స్థానంలో కొనసాగుతోంది. 29 స్వర్ణాలతో ఇంగ్లండ్ రెండో స్థానంలో ఉంది. భారత్ తర్వాతి స్థానాల్లో కెనడా, దక్షిణాఫ్రికా, న్యూజీలాండ్, సైప్రస్, స్కాట్లాండ్, వేల్స్, జమైకా, మలేషియా, నైజీరియా దేశాలు ఉన్నాయి.