channel: టీవీ ఛానల్ యజమాని అని చెప్పుకుంటూ.. అమ్మాయిలను మోసం చేశాడు
- వధువు కావాలంటూ వెబ్ సైట్లలో ప్రకటన
- అమ్మాయిలతో డబ్బులు వేయించుకుని మోసం చేస్తున్న మాయగాడు
- 6 లక్షలు సమర్పించుకున్న ఓ అభాగ్యురాలు
తాను ఒక స్పోర్ట్స్ ఛానల్ యజమానిని అని చెప్పుకుంటూ ఆరుగురు అమ్మాయిలను మోసం చేసిన ఘటన వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే అనురాగ్ అనే వ్యక్తి ద్వారకలో ప్రాపర్టీ డీలరుగా పని చేస్తున్నాడు. అతనికి ఇప్పటికే పెళ్లి అయిన ఒక కుమారుడు కూడా ఉన్నాడు. లక్నోకు చెందిన ఇతను బీబీఏ డిగ్రీ చదివి, ఢిల్లీలో కొన్నాళ్లు బ్యాంకు సేల్స్ మేనేజరుగా కూడా పని చేశాడు.
ప్రస్తుతం ఉద్యోగాన్ని వదిలేసిన ఆయన... తాను ఛానల్ అధిపతినని, తనకు వధువు కావాలంటూ వెబ్ సైట్లలో ప్రకటన ఇచ్చాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానంటూ ఓ అమ్మాయితో చాటింగ్ చేశాడు. ఆ తర్వాత తన తండ్రిని క్యాన్సర్ చికిత్స కోసం లండన్ తీసుకొచ్చానని... లండన్ నంబర్ వచ్చేలా టెక్నాలజీ సాయంతో ఆమెకు ఫోన్ చేశాడు. తనకు అత్యవసరంగా డబ్బు అవసరం అని చెప్పడంతో... ఆమె అతని ఖాతాలో రూ. 6 లక్షలు వేసింది. ఆ తర్వాత ఆ డబ్బు తిరిగి ఇవ్వమని అడగ్గా... ఆమెను బెదిరించాడు.
ఆ తర్వాత అతను చెప్పిన ముంబైలోని టీవీ ఛానల్ చిరునామాకు ఆమె వెళ్లగా, ఆ పేరు గలవారు ఎవరూ లేరని తేలింది. దీంతో పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. పోలీసులు చేపట్టిన దర్యాప్తులో ఆరుగురు అమ్మాయిలను అతను మోసం చేశాడని తేలింది.