vitamin d: ఢిల్లీలో 88 శాతం మంది 'విటమిన్ డి' లోపంతో బాధపడుతున్నారు: అసోచామ్
- ఢిల్లీని పట్టి పీడిస్తున్న విటమిన్-డి లోపం
- చాలా మందికి దీని గురించి అవగాహన కూడా లేదు
- 21 నుంచి 35 ఏళ్ల వయసు ఉన్నవారిలో ఎక్కువ సమస్య
ఢిల్లీలో ప్రతి 10 మందిలో 8 మంది విటమిన్-డి లోపంతో బాధపడుతున్నారని అసోచామ్ కు చెందిన హెల్త్ కేర్ కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఇటీవలే ఢిల్లీలో అసోచామ్ ఓ సర్వే నిర్వహించింది. నగరంలోని 88 శాతం మంది ప్రజలు విటమిన్-డి లోపంతో బాధపడుతున్నారని ఈ సర్వేలో తేలింది. వీరిలో సాధారణం కంటే తక్కువ స్థాయిలో విటమిన్-డి స్థాయులు ఉన్నాయని వెల్లడైంది.
ఈ లోపం వల్ల కండరాల నొప్పులు, శక్తి మందగించడం, డిప్రెషన్, ఉన్నట్టుండి కండరాలు బిగుసుకుపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయని నివేదికలో అసోచామ్ తెలిపింది. చాలా మందికి విటమిన్-డి లోపం గురించి కానీ, దాని వల్ల ఎదురయ్యే సమస్యల గురించి కానీ ఏమాత్రం అవగాహన లేదని వెల్లడించింది. ఈ సర్వే కోసం 21 నుంచి 65 ఏళ్ల వయసున్న వ్యక్తుల బ్లాడ్ శాంపుల్స్ ను సేకరించి, పరీక్షించింది. వీరిలో 21 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న వారిలో విటమిన్-డి లోపం అధికంగా ఉందని తేలింది.
విటమిన్-డి లోపం నుంచి బయటపడటం ఎలా?
మనకు విటమిన్-డిను పుష్కలంగా అందించేది సూర్యరశ్మి. ముఖ్యంగా ఉదయం పూట సూర్య కిరణాల్లో ఉంటే ఈ విటమిన్ అందుతుంది. కనీసం 15 నిమిషాలైనా ఎండలో ఉండాలి. పుట్టగొడుగులు, ఛీజ్, చేపలు, గుడ్లు (పచ్చ సొనలో ఎక్కువగా ఉంటుంది), సోయా మిల్క్ లో కూడా విటమిన్-డి లభిస్తుంది. విటమిన్-డి లోపం మరీ ఎక్కువగా వుంటే డాక్టర్లను కచ్చితంగా సంప్రదించాలి. ఈ లోపాన్ని తేలికగా కొట్టిపారేస్తే... ఆ తర్వాత చాలా బాధలు పడాల్సి ఉంటుంది.