KCR: బెంగళూరులో బీజేపీ, కాంగ్రెస్ లను కడిగిపారేసిన కేసీఆర్

  • దేవేగౌడతో ముగిసిన కేసీఆర్ భేటీ
  • మీడియాతో మాట్లాడుతూ జాతీయ పార్టీలపై ఫైర్ అయిన కేసీఆర్
  • కావేరీ సమస్యకు ఎవరు కారణమంటూ ప్రశ్న

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన మాజీ ప్రధాని దేవేగౌడకు రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్న సమయంలో తాను బెంగళూరుకు వచ్చి దేవేగౌడను కలిశానని... తెలంగాణకు వచ్చి సభల్లో పాల్గొనాలని కోరానని, మీరు వస్తే ఉద్యమకారుల శక్తి మరింత పెరుగుతుందని చెప్పానని... తన కోరిక మేరకు ఆయన తెలంగాణకు వచ్చి భారీ బహిరంగసభలో పాల్గొన్నారని తెలిపారు. ఆ తర్వాత తాము తెలంగాణను సాధించుకున్నామని చెప్పారు.

కాసేపటి క్రితమే బెంగళూరులో దేవేగౌడతో ఆయన భేటీ ముగిసింది. అనంతరం దేవేగౌడ, కేసీఆర్, కుమారస్వామి గౌడలు మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్బంగా 'ఎల్లారిగీ నమస్కార' అంటూ కేసీఆర్ కన్నడలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. దేశంలో గొప్ప మార్పులు సంభవించాల్సి ఉందని ఈ సందర్భంగా కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని 65 ఏళ్ల కంటే ఎక్కువ కాలం పాలించాయని... దేవేగౌడ, వీపీ సింగ్, చంద్రశేఖర్, చరణ్ సింగ్, మొరార్జీ తదితరులు కొంత కాలం దేశాన్ని పాలించారని చెప్పారు.

కాంగ్రెస్, బీజేపీలు పరిపాలనలో దారుణంగా విఫలమయ్యాయని ఎద్దేవా చేశారు. తాను ఒక ఉదాహరణ చెబుతానని... కావేరీ జలాల కోసం దశాబ్దాలుగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు పోట్లాడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు తలెత్తిందని కేసీఆర్ ప్రశ్నించారు. ఏడు దశాబ్దాలుగా ఈ సమస్యను ఎందుకు పెండింగ్ లో ఉంచారని అడిగారు. దీనికి ఏమైనా అర్థముందా? అని అన్నారు. మరోసారి బెంగళూరు వచ్చినప్పుడు దీనికి సంబంధించి పూర్తి విషయాలను చెబుతానని అన్నారు.

సెంట్రల్ వాటర్ కమిషన్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం. ప్రతి ఏటా మన దేశంలో 70వేల టీఎంసీల నీరు లభిస్తుందని కేసీఆర్ చెప్పారు. దేశంలో సాగుభూమి 40 కోట్ల ఎకరాలని... ఈ నీటిని సక్రమంగా వాడుకుంటే, ఇంకా 13వేల టీఎంసీల నీరు మిగిలిపోతుందని తెలిపారు. అలాంటప్పుడు కావేరీ లాంటి సమస్యలన్నీ తొలగిపోతాయని చెప్పారు. దేశంలో నీటి యుద్ధాలకు కారణం ఎవరని ప్రశ్నించారు. నీటి వినియోగంలో చైనా అద్ఛుతమైన పనితీరును కనబరుస్తోందని... మన దేశానికి ఏమైందని ప్రశ్నించారు.

కృష్టా జలాలకు సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ను ఎప్పుడో ఏర్పాటు చేశారని... ఇప్పటి వరకు దాన్నుంచి ఎలాంటి తీర్పు వెలువడలేదని కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీల తీరు వల్లే కావేరీ లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు. దేవేగౌడలాంటి పెద్దల సహకారంతో దేశంలో మార్పులు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. మార్పు కోసం తాము చేస్తున్న ప్రయత్నంలో జేడీఎస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం తదితర ఏ పార్టీలైనా కలసిరావచ్చని చెప్పారు.

  • Loading...

More Telugu News