Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రధాని అయితే ప్రత్యేక హోదాపై తొలి సంతకం పెడతారు: రఘువీరారెడ్డి
- కాంట్రాక్టు ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి
- ఉద్యోగుల కష్టాలు తీరాలంటే హోదా రావాలి
- హోదా వస్తే ప్రజారోగ్య వైద్యులు రోడ్డుపైకి వచ్చే పరిస్థితి ఉండేది కాదు
ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యం పడకేసిందని, అందుకు కారణం 21 వేల మంది ప్రజారోగ్య వైద్య కాంట్రాక్టు ఉద్యోగులను విధుల్లోంచి తీసేయడమేనని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను వీధుల్లోకి తోసేశాక ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా ఎలా ఉంటుందని ఏపీ సర్కారు అనుకుంటోందని నిలదీశారు. ప్రజారోగ్య వైద్య సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు ఛలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా విజయవాడలోని ధర్నాచౌక్‌లో ప్రజారోగ్య వైద్య సంఘం సభ్యులు నిరసన తెలిపారు.
ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న రఘువీరారెడ్డి మాట్లాడుతూ... ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తరువాత మరోమాట మార్చడం టీడీపీకి ఆనవాయతిగా మారిందని, ఈ తీరు సరైంది కాదని అన్నారు. అలాగే, ఏపీలో ఉద్యోగుల కష్టాలు తీరాలంటే ప్రత్యేక హోదా రావాలని రఘువీరారెడ్డి అన్నారు. ఆనాటి ప్రధాని ఇచ్చిన హామీలన్నింటినీ ఇప్పటి కేంద్ర ప్రభుత్వం అమలు చేసి ఉంటే ఇప్పుడు ప్రజారోగ్య వైద్యులు రోడ్డుపైకి వచ్చే పరిస్థితి ఉండేది కాదని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి రాహుల్ గాంధీ ప్రధాని అయితే ప్రత్యేక హోదాపై తొలి సంతకం పెడతారని అన్నారు.