inter exams: తెలుగుకు తెగులు పట్టింది.. మాతృభాషలోనే ఎక్కువగా ఫెయిలవుతున్నారు!
- కష్టమైన సబ్జెక్టుల్లో తెలుగు కూడా చేరింది
- ఆంగ్లంలో ప్రావీణ్యం.. తెలుగులో ఫెయిల్
- తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో తేటతెల్లం
మాతృ భాషను విస్మరిస్తూ, ఆంగ్లభాషపై మక్కువతో తెలుగును చంపేస్తున్నామని భాషాప్రేమికులు పలుసందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు మన విద్యార్థులకు అతి కష్టమైన సబ్జెక్టుల్లో తెలుగు పరీక్ష కూడా ఒకటిగా వచ్చి చేరింది. గతంలో తెలుగు పరీక్షలో ఫెయిలైతే చిన్న చూపు చూసేవారు. తెలుగులో ఫెయిలయ్యాడని ఎద్దేవా చేసేవారు.
తాజాగా విడుదలైన తెలంగాణ రాష్ట్ర ఇంటర్ పరీక్ష ఫలితాల్లో ఆంగ్ల భాషలో ప్రావీణ్యం చూపిన విద్యార్థులు తెలుగులో ఫెయిల్ కావడం మాతృభాషా ప్రేమికుల్లో ఆవేదన పెంచుతోంది. ఇంటర్ సెకండియర్ లో ఇంగ్లిష్ పేపర్లో 8.65% ఫెయిల్ కాగా, మాతృ భాషైన తెలుగు పేపర్లో 11.63% మంది పరీక్ష తప్పారు. సెకండియర్ మ్యాథ్స్-బీ లో 20.89% ఫెయిలయ్యారు. ఇక ఆర్ట్స్ లో కామర్స్ లో 29.8% మంది ఫెయిల్ కాగా, సివిక్స్ లో 30.04% పరీక్ష తప్పడం విశేషం.