USA: వైట్ హౌస్ ను ట్రంప్ మాఫియా డాన్ లా నిర్వహిస్తున్నారు: ఎఫ్బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కోమీ
- పుస్తకం రాస్తున్న ఎఫ్భీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కోమీ
- ‘ఎ హైర్ లాయలిటీ: ట్రూత్, లైస్ అండ్ లీడర్‌షిప్’ పుస్తకంలో ట్రంప్ గురించి పలు అంశాలు
- అధ్యక్షుడు వాస్తవానికి దూరంగా బతుకుతున్నారు
వైట్ హౌస్ ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాఫియా డాన్ లా నడిపిస్తున్నారని ఎఫ్బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కోమీ తెలిపారు. 2017 మేలో ఎఫ్బీఐ నుంచి జేమ్స్ కోమీని ట్రంప్ తొలగించిన సంగతి తెలిసిందే. ‘ఎ హైర్ లాయలిటీ: ట్రూత్, లైస్ అండ్ లీడర్ షిప్’ పేరిట ఆయన పుస్తకం రాస్తున్నారు. ఈ పుస్తకం వచ్చే మంగళవారం విడుదల కావాల్సి ఉండగా, ఇందులోని వివిధ విషయాలు లీకై అమెరికా మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి.
ఈ పుస్తకంలో.. అమెరికా అధ్యక్షుడు వాస్తవానికి దూరంగా బతుకుతున్నారని కోమీ పేర్కొన్నారు. ట్రంప్ తన చుట్టూ ఓ గూడును అల్లుకున్నారని, మిగతా వారిని కూడా అందులోకి లాగేందుకు ప్రయత్నిస్తుంటారని ఆయన ఆరోపించినట్టు తెలుస్తోంది. అధ్యక్షుడిగా ట్రంప్ తనతో నిర్వహించిన సమావేశం తన కెరీర్ మొదట్లో జరిగిన మాఫియా విచారణ తరహాలో అనిపించిందని ఆయన పేర్కొన్నారు.
ఆయన చెప్పేవాటిని సమ్మతించేవారే ఆయన చుట్టూ ఉంటారని, దీంతో అన్నీ బాస్ అధీనంలోనే ఉండేవని ఆయన పేర్కొన్నారు. ఈ అధ్యక్షుడి చర్యలు అనైతికమని, సంస్థాగత విలువలను పట్టించుకోరని జేమ్స్ కోమీ తన పుస్తకంలో రాసుకునట్లు తెలుస్తోంది. ట్రంప్ నాయకత్వం అహం, అబద్ధాలు, వ్యక్తిగత విశ్వసనీయలతో నడుస్తోందంటూ ఆయన తన పుస్తకంలో పేర్కొన్నట్లు సమాచారం. దీంతో ఈ పుస్తకంలో ట్రంప్ గురించి ఆయన ఇంకేం రాశారోనని ఆసక్తి పెరుగుతోంది.